Eight Accused Arrested In Nellore Rape Case: నెల్లూరులో సంచలనం సృష్టించిన యువతి గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వేదాయపాళెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న 8 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దుశ్చర్యలో మొత్తం 9మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన కత్తితోపాటు, ఆటో, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
అసలేం జరిగిందంటే: ఈ నెల 10వ తేదీన నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉన్న ఓ యువతిని.. నలుగురు యువకులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. ఆమెను కత్తితో బెదిరించి కొండయపాలెం దగ్గర గల శ్రీదేవి కాలనీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ నలుగురు యువకులు.. మరో ఐదుగురు యువకుల్ని పిలిపించినట్లు వివరించారు.
మొత్తం తొమ్మిది మంది యువకులు ఆత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి:నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఓ ఘటనలో బుచ్చి నుంచి నెల్లూరు వైపు వస్తున్న బైక్, కారు, ఆటో రామచంద్రారెడ్డి నగర్ వద్దకు రాగానే ఒకదానితో మరోకటి డీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులలో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు.
మృతుడు బుచ్చి మండలం వడ్డిపాళేనికి చెందిన రవిగా పోలీసులు గుర్తించారు. బుచ్చిలోని లైలా ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్డిపాళేనికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. సైకిల్‌పై బుచ్చిరెడ్డిపాలెంకు వెళ్తున్న క్రమంలో వెనక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రామతీర్థంలో అపశృతి:నెల్లూరులోని విడవలూరు మండలం రామతీర్థంలో బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పొయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సముద్ర స్నానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సముద్రంలో స్నానం ఆచరిస్తున్న ఇద్దరు యువకులు అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. మృతులు విడవలూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన కల్యాణ్, కార్తీక్‌లుగా పోలీసులు గుర్తించారు.