ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహమ్మారీలా విస్తరిస్తున్న మూత్రపిండాల వ్యాధి.. మన రాష్ట్రంలోనే!

By

Published : Mar 22, 2023, 12:52 PM IST

Parvathipuram Manyam district
Parvathipuram Manyam district ()

Parvathipuram Manyam district: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆ పల్లె ప్రజలకు సేద్యమే ప్రధాన జీవనాధారం. శ్రమ జీవులైన ఆ గ్రామస్థులు మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వృద్దులు సైతం.. ఉల్లాసంగా సేద్యపనుల్లో పాలు పంచుకునేవారు. ఇటీవల ఆ గ్రామంలో ఎవరిని పలకరించినా.. ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం.. గ్రామంలో మహమ్మారీలా విస్తరిస్తున్న మూత్రపిండాల వ్యాధి. గత ఐదేళ్ల క్రితం ఒక్కరిద్దరితో మొదలైన ఈ మాయదారి రోగం., ప్రస్తుతం రెండు పదుల మందికి పైగా పాకింది.

Parvathipuram Manyam district: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని నిడగల్లు గ్రామమిది. దాదాపు 5వేల మంది ఇక్కడ నివాసముంటున్నారు. వీరందరిదీ సేద్యమే ప్రధాన జీవనాధారం. వ్యవసాయ గ్రామమైన ఈ ఊరిని గత ఐదేళ్లుగా మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది. క్రమంగా విస్తరిస్తూ.. నడి వయస్కులను సైతం నడ్డి విరుస్తోంది. దీనిబారిన పడిన బాధితులు.. నరకయాతన అనుభవిస్తున్నారు. ఏ పనీ చేసుకోలేక, ఎక్కడికీ వెళ్లలేక శారీరకంగా.. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో అధికశాతం నిరుపేదలు. వీరంతా ప్రతినెలా మందులు కొనుగోలు చేయలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. మందులకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావటంతో బాధితులు ఆర్థికంగా చితికిపోతున్నారు. అసలు ఎందుకు ఈ గ్రామంలో ఈ మహమ్మారి వ్యాపిస్తుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గత ఐదేళ్ల క్రితం.. ఒక్కరిద్దరితో మొదలైన ఈ రోగం.. ప్రస్తుతం పాతికమందికి పైగా వ్యాప్తి చెందింది. బాధితుల్లో వృద్ధులతో పాటు.. నడివయస్సు కలిగిన వారు సైతం ఉండటం గమనార్హం.

ఇప్పటికే దీని బారినపడిన బాధితులు వారానికి మూడు సార్లు డయాలిసిస్ చేయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి. ఉపాధికి వలస వెళ్లిన యువకులు.. తమ తల్లిదండ్రులకు చికిత్స అందించేందుకు పనులు వదులుకొని గ్రామంలోనే ఉండాల్సి వస్తోంది. వ్యవసాయాధార కుటుంబాలను కిడ్నీ రోగం అప్పులు పాలు చేస్తోంది. ఒక వైపు ఉపాధి లేక, మరో వైపు రోగం నయం చేయించుకోవడానికి డబ్బులు లేక.. అనేక రకాల అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసినా తమ వారి ప్రాణాలు నిలవకపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. గతేడాది ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వంద మందిని పరీక్షించగా 27 మందిలో కిడ్నీ సంబంధిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 6న విశాఖ కేజీహెచ్ నుంచి వైద్య రంగ నిపుణులు వచ్చి 190 మందిని పరీక్షించారు. వీరిలో ఎంత మంది కిడ్ని వ్యాధి సకిన వారు ఉన్నారో అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైన అధికారులు.. కేజీహెచ్ వైద్య బృందం చేపట్టిన సర్వే ఫలితాల ఆధారంగా రోగం మూలాలను గుర్తించి.. భవిషత్తు తరాలకు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. నిడగల్లులో ప్రబలతున్న మూత్రపిండాల వ్యాధి విషయంపై.. సంబంధిత పెదంకలాం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వైద్యురాలు రాధాకాంత్ వివరణ ఇస్తూ.. గ్రామంలో ఇప్పటి వరకు రెండు దఫాలు ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. గతంలో 100 మందికి పరీక్షలు నిర్వహించగా.. 27మందిలో కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

తాజాగా విశాఖ కేజీహెచ్ నుంచి వైద్య రంగ నిపుణులు 190 మందిని పరీక్షించారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఆ ఫలితాల ఆధారంగా.. వ్యాధి వ్యాప్తి కారణాలను విశ్లేషించి.. నివారణ చర్యలు తీసుకుంటామని వైద్యురాలు రాధాకాంత్ తెలియచేశారు. నిడగల్లు గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలను గుర్తించటంతో పాటు.. 25ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అదేవిధంగా.. వ్యాధి సోకిన వారికి ఉచితంగా మందులను అందించటంతో పాటు.. సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details