CJI NV Ramana Ponnavaram Tour సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా పొన్నవరంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సమేతంగా గ్రామానికి చేరుకున్న సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. అక్కడినుంచి రామలింగేశ్వరస్వామి గుడికి వెళ్లిన సీజేఐ దంపతులు.. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత.. సొంత ఇంటికి వెళ్లారు. బంధువులు, గ్రామస్థులతో ఎన్వీ రమణ నివాసం కోలాహలంగా మారింది. కుటుంబ సభ్యులు, సమీప బంధువులతో ముచ్చటించిన సీజేఐ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గ్రామస్థులను పేరు పేరునా పలకరించారు. సీజేఐ హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ రెండోసారి స్వగ్రామంలో పర్యటించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్‌కు బయల్దేరారు.
అంతకుముందు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వర్సిటీలో జరిగిన 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ రమణను గౌరవ డాక్టరేట్‌తో యూనివర్శిటీ సత్కరించింది. అనంతరం సీజేఐ విద్యార్థులకు పట్టాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.