ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీలో కీలక మార్పులు..పలువురికి ఉద్వాసన

By

Published : Nov 24, 2022, 7:37 AM IST

Updated : Nov 24, 2022, 7:45 AM IST

అధికార వైకాపాలో కీలక మార్పులు
అధికార వైకాపాలో కీలక మార్పులు ()

అధికార వైకాపాలో కీలక మార్పులు జరిగాయి. ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల, బుగ్గన, అనిల్‌, కొడాలి నానికి ఉద్వాసన పలికారు. 8 జిల్లాల పార్టీ అధ్యక్షులనూ మార్చేశారు. ఎంపీ అయోధ్యరామిరెడ్డికి పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించగా... అనుబంధ విభాగాల సమన్వయకర్తగా చెవిరెడ్డిని నియమించారు.

"మీరు చేయగలిగితే చేయండి.. లేదా కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగిస్తా"... ఇదీ.. ఇటీవల గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన అల్టిమేటం. ఆ మేరకు ఇప్పుడు పార్టీలో పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేశారు. ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, వై.బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని.. జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి హెచ్చరికల తర్వాత తమను తప్పించమంటూ ముగ్గురు జిల్లా అధ్యక్షులు కోరినట్లు తెలిసింది. మిగిలిన 5 జిల్లాల్లో పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుని మార్చేసిందని అంటున్నారు. కుప్పం వైకాపా బాధ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్‌ను.. చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తీసేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఆ బాధ్యత అప్పగించారు.

ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. ఈ నలుగురితోపాటు బాలినేని కూడా సమన్వయకర్తగా విఫలమయ్యారని సెప్టెంబర్‌లో నిర్వహించిన "గడప గడపకు" సమీక్షలో సీఎం అసహనం వ్యక్తంచేశారు. వీరిలో బాలినేనికి మాత్రమే కొనసాగింపు దక్కింది.

సజ్జల, బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను వైఎస్సార్​ జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి ఇచ్చారు. అనిల్‌ వద్దనున్న వైఎస్సార్​, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. బాలినేనికి ఇప్పటి వరకూ ఉన్న మూడు జిల్లాల్లో నెల్లూరును కొనసాగించారు. బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తాన్‌రావుకు ఇచ్చారు. కొడాలి నాని పర్యవేక్షించిన పల్నాడు బాధ్యతను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అప్పజెప్పారు.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మర్రి రాజశేఖర్‌కు... గుంటూరు జిల్లానూ కట్టబెట్టారు. ఆయనతో పాటు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా ఎన్టీఆర్​, కృష్ణా, గంటూరు ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి బాధ్యతల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారు. వైవీ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు కేటాయించారు.

తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని.. కీలకమైన పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి.. చెవిరెడ్డి సహాయకారిగా వ్యవహరిస్తారని వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

ఇవీ చదవండి:

Last Updated :Nov 24, 2022, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details