ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారన్న ఎంపీ గోరంట్ల

By

Published : Aug 14, 2022, 8:13 PM IST

Updated : Aug 15, 2022, 6:34 AM IST

ఫేక్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయల్దేరిన ఎంపీ మాధవ్‌కు కురువ సంఘం నాయకులు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్‌ వద్ద స్వాగతం పలికారు.

MP Gorantla
MP Gorantla

మార్ఫింగ్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయల్దేరిన ఎంపీ మాధవ్‌కు.. కురువ సంఘం నాయకులు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్‌ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ.. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు.. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. వీడియో నిజమైనదా? కాాదా? అని తేల్చేందుకు పోలీసు వ్యవస్థ ఉందన్న ఆయన.. ఆ పనిని పోలీసులకు వదిలేయాలని చెప్పుకొచ్చారు. తనపై ఈ ప్రచారం కొనసాగిస్తే పాత మాధవ్‌ను చూస్తారంటూ ఆయన శైలిలో హెచ్చరించారు.

నాపై విష ప్రచారం ఆపండి..

పత్రికలు, టీవీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో కరవు కాటకాలపై చర్చ పెట్టాలి, కానీ ఓ ఫేక్‌ వీడియో, మార్ఫింగ్‌ చేసిన వీడియోపై చర్చ పెట్టడం పద్ధతి కాదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. తప్పుడు వీడియోలపై అనవసరం రాద్ధాంతం కూడదని.. ఇప్పటికైనా దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీ అని కూడా చూడకుండా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా తనపై విష ప్రచారం ఆపేయాలని కోరారు. ఆదివారం ఆయన డోన్‌లోనూ, అనంతరం అనంతపురంలోని తన నివాసంలోనూ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆ వీడియోను పరీక్షలకు పంపి నిజాలు తేల్చాలని తాము పోలీసులను కోరామన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీల గొంతు మీద కత్తిలాగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో పరీక్షకు పంపామని, అక్కడ సర్టిఫికెట్‌ ఇచ్చారంటూ కొత్త విషయాలకు తెర మీదకు తెస్తున్నారన్నారు. గోరంట్ల మాధవ్‌ కోసమో, చంద్రబాబు కోసమో పోలీస్‌ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. కొందరు తామే ఖాకీ దుస్తులు వేసుకున్నట్లుగా, ఫోరెన్సిక్‌ నిపుణుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఉరిశిక్ష ఒక్కటే వేయలేదు..
తాను ఒక సామాజికవర్గానికి వ్యతిరేకం కాదని ఎంపీ మాధవ్‌ పేర్కొన్నారు. మార్ఫింగ్‌ చేసిన వీడియో యూకే నుంచి తెదేపా ఐటీడీపీ గ్రూపులో అప్‌లోడ్‌ అయ్యిందని, తర్వాత దానిని రెండు ఛానళ్లు ప్రసారం చేశాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిజనిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. పోలీసులు అది నిజమైన వీడియో కాదని ప్రాథమికంగా చెప్పినా.. కొన్ని టీవీ ఛానళ్లు పనిగట్టుకొని చర్చావేదికలు నిర్వహించాయని పేర్కొన్నారు. ‘వారే సొంతంగా విచారణ చేశారు.. నల్లగౌను వేసుకొని ఉరిశిక్ష ఒక్కటే వేయలేదు’ అని అన్నారు. ఆయన వెంట మాదాసి, మాదారి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమలింగడు, శివలింగం, కోశాధికారి కేసీ మద్దిలేటి, రాష్ట్ర నాయకులు రంగనాథం, లక్ష్మన్న, బీసీ సంఘం నాయకులు భాస్కర్‌నాయుడు, ప్రకాశ్‌, ఆనంద్‌ ఉన్నారు.

Last Updated : Aug 15, 2022, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details