ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan: ప్రపంచంలో అతిపెద్ద ఐఆర్‌ఈఎస్‌ ప్రాజెక్టు పైలాన్‌ ఆవిష్కరణ

By

Published : May 17, 2022, 3:22 PM IST

Updated : May 18, 2022, 5:18 AM IST

CM Jagan kurnool Tour: గ్రీన్​కో ప్రాజెక్ట్ దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కర్నూలు జిల్లా గుమ్మితం తండాలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ (గ్రీన్‌కో) ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చిన గ్రీన్‌ కో సంస్థకు సీఎం అభినందలు తెలిపారు.

మెగా పవర్‌ ప్రాజెక్టు వల్ల 20 వేల మందికి ఉపాధి
మెగా పవర్‌ ప్రాజెక్టు వల్ల 20 వేల మందికి ఉపాధి

Integrated Renewable Energy Storage Project: రాష్ట్రంలో చేపడుతున్న సమీకృత పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ - ఐఆర్‌ఈఎస్‌పీ) భవిష్యత్తులో యావత్‌ దేశానికి మార్గదర్శకం కానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలోని గుమ్మటం తండా వద్ద గ్రీన్‌కో సంస్థ 5,230 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి రూ.30,000 కోట్లతో చేపడుతున్న ఐఆర్‌ఈఎస్‌ ప్రాజెక్టు పైలాన్‌ను ఆయన ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చిన గ్రీన్‌ కో సంస్థకు అభినందలు తెలిపారు.

ముందుముందు విద్యుదుత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల బదులు పునరుత్పాదకశక్తి ఇంధన విభాగమే ముందంజలో నిలవనుందన్నారు. పర్యావరణహిత విద్యుదుత్పత్తి (గ్రీన్‌ పవర్‌) రంగంలో ఆసక్తి ఉన్న సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌లో దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సానుకూల వాతావరణం, సదుపాయాలవల్ల 33,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి విషయంలో దేశానికి ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు.

మిత్తల్‌ కంపెనీ ఒప్పందం :ఈ ప్రాజెక్టువల్ల ఒకేచోట జల, పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. సౌర, పవన విద్యుత్తును ఉపయోగించి నీటిని ఎగువ జలాశయంలోకి పంపి, డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో ఆ నీటిని దిగువకు వదిలి విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా రోజంతా విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని తెలిపారు. కాలుష్య రహితం, పర్యావరణ సమతుల్యత ఇక్కడ చాలా కీలకమైన అంశమన్నారు. మిత్తల్‌ కంపెనీ ఈ ప్రాజెక్టుతో వ్యాపార ఒప్పందం చేసుకుందని వివరించారు. ఆ సంస్థ ఇక్కడ 250 మెగావాట్ల విద్యుత్‌ ఉపయోగించి 1,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, తద్వారా నిర్దేశించిన ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు లోటు లేకుండా కచ్చితంగా 250 మెగావాట్ల విద్యుత్‌ను కర్నూలు నుంచి సరఫరా చేస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో ఇది ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టనుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 23,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

ఇంధన రాజధానిగా ఏపీ- గ్రీన్‌కో సీఈవో:జాతీయ స్థాయిలో విధానపరమైన మద్దతుతోపాటు, ముఖ్యమంత్రి జగన్‌ విజన్‌ కారణంగానే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని గ్రీన్‌కో గ్రూప్‌ సీఈవో చలమలశెట్టి అనిల్‌ అన్నారు. పారిశ్రామికంగా కర్బన ఉద్గారాల తగ్గింపు, విద్యుత్‌ ఉత్పత్తికి 24 గంటలు అందుబాటులో ఉండేలా పునరుత్పాదక విద్యుత్తు పరిష్కారాలను అందించాలన్న అంతర్జాతీయ లక్ష్యాని కంటే ముందుగానే ఆ దిశగా అడుగులు వేసిన ఘనత గ్రీన్‌కోకు దక్కుతుందని చెప్పారు. అత్యంత అనుకూలమైన వాతావరణం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ భారతదేశానికి ఇంధన రాజధానిగా (ఎనర్జీ స్టోరేజ్‌ క్యాపిటల్‌) నిలవనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది చివరికి కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు నమూనాను బహూకరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌, అటవీ పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, గ్రీన్‌కో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

"ఈ ప్రాజెక్టు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నాం. ఇందులో పంప్డ్‌ స్టోరేజీ, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఒకేచోట చేయవచ్చు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో కొంతమేర సౌర, పవన విద్యుత్‌ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. విద్యుత్‌కు డిమాండ్‌ ఉన్న సమయంలో ఆ నీటి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తారు. నిరంతరం పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ ప్రాజెక్టు.. భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు అమలు చేసేందుకు ఆదర్శంగా ఉంటుంది. శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తి తగ్గి పునరుత్పాదక విద్యుత్ పెరుగుతుంది. గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు.. దేశానికి సరికొత్త మార్గం చూపుతుంది" - జగన్, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి

Last Updated : May 18, 2022, 5:18 AM IST

ABOUT THE AUTHOR

...view details