ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భవనాలు.. ప్రారంభించిన శైలజాకిరణ్‌

By

Published : Feb 5, 2023, 4:36 PM IST

Ramoji Foundation works in Pedaparupudi: కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజా కిరణ్‌ ప్రారంభించారు. సమాజ హితమే.. రామోజీ ఫౌండేషన్‌ పథమని శైలజాకిరణ్‌ తెలిపారు. పెదపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు.

Margadarshi Managing Director CH Shailaja Kiran
మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజా కిరణ్‌

Ramoji Foundation works in Pedaparupudi: రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజా కిరణ్‌ ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం, పశువైద్యశాల, మండల పరిషత్​ ప్రాథమిక పాఠశాల నూతన భవనాలను లాంఛనంగా ప్రజలకు అంకితమిచ్చారు. రామోజీ ఫిలింసిటీ డైరెక్టరు ఎం.శివరామకృష్ణతోపాటు పెదపారుపూడి సర్పంచ్ సమీర, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ టి.వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ కాజా విజయలక్ష్మి, గ్రామ ప్రముఖులు చంద్రశేఖరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమాజ హితమే.. రామోజీ ఫౌండేషన్‌ పథమని శైలజాకిరణ్‌ తెలిపారు. పెదపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని అంచెలంచెలుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ వస్తోందని చెప్పారు. మాతృభూమి.. మాతృభాష అంటే రామోజీ గ్రూపుల సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు అమితమైన అభిమానమని.. సొంతూరు రుణం తీర్చుకోడానికి, పెదపారుపూడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో తనవంతు కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో 16 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులను రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన ఈ అభివృద్ధి పనులతో.. పెదపారుపూడి గ్రామం భారతావనికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

గతంలో మరో 13 కోట్ల రూపాయలతో తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మాణం, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా శుద్ధ జలాలు అందించడం, శ్మశాన వాటికల అభివృద్ధి, గ్రామంలో చెరువును ఆధునికీకరించి దానిచుట్టూ చూడముచ్చటైన పార్కు ఏర్పాటు, అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చడం, మండల కేంద్రంగా ఉన్న పెదపారుపూడిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రహదారుల విస్తరణ చేసినట్లు తెలిపారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించామని.. వీఆర్వో కార్యాలయ భవన నిర్మాణం, స్త్రీశక్తి భవనం ఆధునికీకరణ జరిపామన్నారు. పెదపారుపూడి అభివృద్ధికి రామోజీ ఫౌండేషన్ చేస్తోన్న కృషిని స్థానికులు అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.

రామోజీ ఫౌండేషన్ అభివృద్ధి కార్యక్రమాలు

"ఈ గ్రామాన్ని రామోజీ రావు గారు 2015లో దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన జన్మించిన గ్రామం ఇది. ఇక్కడే చదువుకున్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటి నుంచి 16 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గ్రామంలో రోడ్లు, ఉన్నత పాఠశాల, పశు వైద్యశాల, శ్మశానాలు, వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం నిర్మించాము. అదే విధంగా అంగన్​వాడీ కేంద్రం, క్లీన్ డ్రింకింగ్ వాటర్ సదుపాయం, వీఆర్వో కార్యాలయం కట్టించాము. ఇంకా చేస్తూనే ఉంటాం. ఇప్పటి వరకూ 89 కోట్ల రూపాయలను సీఎస్ఆర్ ఫండ్స్ కింద చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో నాగన్​పల్లి గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేశాం. రామోజీరావు గారు ఎప్పుడూ జనహితం కోరుకునే మనిషి. ప్రజాహితమే ఆయన జీవనశైలిగా వస్తోంది". - సీహెచ్‌.శైలజాకిరణ్‌, మార్గదర్శి ఎండీ

"రామోజీ రావు గారు మన గ్రామంలో జన్మించడం ఒక వరంగా భావిస్తున్నాం. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎంతో బాగున్నాయి. ఆయన జన్మించిన ఈ గ్రామంలో..నేను సర్పంచ్​గా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా.. రామోజీ రావు గారు ఒక తండ్రిలా మా వెంట ఉన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకి చాలా రుణపడి ఉంటాం". - సమీర, పెదపారుపూడి సర్పంచ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details