ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ టీచరమ్మ చేస్తున్న సేవకు.. జేజేలు పలకాల్సిందే..!

By

Published : Apr 10, 2021, 1:23 PM IST

ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే చాలామంది ఆలోచిస్తారు. ఆ పాఠశాలలోనూ అంతే. ఆరుగురు విద్యార్థులే మాత్రమే చేరారు. ఈ పరిస్థితిని మార్చాలనుకున్న ఓ టీచర్‌.. బడిలో చేర్పిస్తే ప్రతి విద్యార్థి పేరు మీద డబ్బులు జమచేస్తానని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. రోజుకు రూపాయి చొప్పున జమచేస్తూ నమ్మకాన్ని చూరగొన్నారు. ఇలా పేద విద్యార్థులకు చదువుతో పాటు వారి బంగారు భవితకు బాటలు వేస్తున్నారు... ఆ పంతులమ్మ.

one rupee teacher at bandalayicheruvu
బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో రుపాయి టీచర్

బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో రుపాయి టీచర్

పాఠశాలకు విద్యార్థులు రావడానికి ఆ ఉపాధ్యాయురాలు ఆసక్తి అంతా ఇంతా కాదు. పిల్లల తల్లితండ్రులకు విద్యపట్ల అవగాహన కల్పించి వారు పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. జే. పద్మావతి అనే మహిళ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం, బందలాయి చెరువులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పద్మావతిని అందరూ రూపాయి టీచర్‌ అని ముద్దుగా పిలుస్తారు. అంటే రూపాయి తీసుకుని... చదువు చెబుతారని కాదు. రోజూ పిల్లలకు రూపాయి ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతారు. గతంలో అవనిగడ్డ మండలం గుడివాకపాలెం పాఠశాలలో పనిచేసిన పద్మావతి... బడిలో ఆరుగురు విద్యార్థులు ఉండటాన్ని గమనించారు.

ఎలాగైనా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ మంచి ఆలోచన పద్మావతికి తట్టింది. పిల్లల పేరు మీద ఆర్‌ డీ అకౌంట్‌ తెరిచి... ప్రతి విద్యార్థి పేరు మీద రోజుకు రూపాయి చొప్పున నెలకు 30 రూపాయలు జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి తమ పిల్లలను... పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీంతో పద్మావతి మీద నమ్మకంతో తల్లిదండ్రులు.. తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్త 45 మంది విద్యార్థులయ్యారు.

జీతంలో 30శాతం విద్యార్థుల కోసం

పద్మావతి తన జీతంలో 30శాతం విద్యార్థుల భవిష్యత్తుకు ఖర్చు పెడుతున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమ చేయడమే కాకుండా... పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. అలా విద్యార్థులకు విద్యతో పాటు పొదుపుపై పాఠాలు చెబుతూ... ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు.

పేదల కోసం

పద్మావతి ఏ పాఠశాలకు వెళ్లినా...పొదుపు ఖాతాల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థులు తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు .పేదలకు వీలైనంత సేవ చేయడమే తన లక్ష్యమంటున్న పద్మావతి....ఉద్యోగవిరమణ తర్వాత వృద్ధులకు సేవ చేస్తానంటున్నారు.

ఇదీ చూడండి:

పోలవరం సమీపంలో బస్సు ప్రమాదం.. బస్సులో 70 మంది ప్రయాణికులు

ABOUT THE AUTHOR

...view details