Bandaru port: బందరు పోర్టు నిర్మాణానికి ఒప్పందం ప్రకారం భూములు తమకు అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్(ఎన్‌ఎంపీఎల్) సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇవ్వజూపిన భూములు సైతం ఆక్రమణలో ఉన్నాయన్నారు. ఒక వేళ తాము ఒప్పంద నిబంధనలకు కట్టుబడలేదని భావిస్తే ముందుగా నోటీసు ఇవ్వాలని, నిర్థిష్ట గడువు ముగిశాక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి ఉందన్నారు. ఆ నిబంధనను పాటించకుండా బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో ఇచ్చిందన్నారు. ఒప్పంద షరతుల మేరకు వ్యవహరించడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. యథాతథ స్థితి ఉత్తర్వులు ఇవ్వకపోతే పోర్టు నిర్మాణ పనులను ప్రభుత్వం మూడో పక్షానికి అప్పగించే ప్రమాదం తెలిపారు. పూర్తిస్థాయి వాదనలు చెప్పేందుకు విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల(పోర్ట్స్)శాఖ ముఖ్య కార్యదర్శి 2019 ఆగస్టు 8న జారీచేసిన జీవో 66ను సవాలు చేస్తూ ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్’ సంస్థ డైరెక్టర్ వై.రమేశ్ 2019 సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి... వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఈ ఏడాది ఆగస్టు 25న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఎంపీఎల్ ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది. సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను పూర్తి చేయకుండా పిటిషనర్ సంస్థ(ఎన్‌ఎంపీఎల్) బాధ్యతను భర్తీ చేయడం సాధ్యపడదని న్యాయవాది అన్నారు. 4,800 ఎకరాల భూమిని ఒక్కసారిగా తమకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. విడతల వారీగా అప్పగిస్తామంటే కుదరదని ఒప్పంద నిబంధన 3.2.1(బి)(1) ప్రకారం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు.. ప్రభుత్వం అంగీకరించిన మొత్తం భూమిని ఒక్కసారిగా అప్పగించాలని స్పష్టం చేశారు.
తమకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన 2,900 ఎకరాలు వివాదాలు, ఆక్రమణల్లో ఉందని చెప్పారు. కేవలం 539 ఎకరాలు మాత్రమే ఎలాంటి వివాదం లేకుండా ఉందన్నారు. ప్రతిపాదిత భూములు ఆక్రమణల్లో ఉన్నాయని తహశీల్దార్, కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. భూమిని అప్పగించకుండా 2018 మార్చి నాటికి ఎన్‌ఎంపీఎల్ ఫైనాన్షియల్ క్లోజర్ సాధించడం ఏవిధంగా సాధ్యపడుతుందని కోర్టుకు తెలిపారు. పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తామన్న భూమిని తీసుకోకుండా ఎన్‌ఎంపీఎల్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని హైకోర్టు సింగిల్ జడ్జి పొరపాటుపడ్డారని వాదించారు.