ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...వసతిగృహాలు తెరవొచ్చు

By

Published : Nov 5, 2020, 10:17 AM IST

రాష్ట్రంలో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యాయి. వీటితో పాటు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వసతి గృహాలు తెరిచేందుకు సాంఘిక సంక్షేమశాఖ అనుమతిని ఇచ్చింది. హాస్టల్స్​లో విద్యార్థులు తరుచూ ఉపయోగించే ప్రాంతాలను శానిటైజ్​ చేయాలని ఆదేశించారు.

కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...వసతిగృహాలు తెరవొచ్చు

కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...వసతిగృహాలు తెరవొచ్చు

కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ వసతిగృహాలు తెరిచేందుకు సాంఘిక సంక్షేమశాఖ అనుమతి ఇచ్చింది. వీటిని నవంబరు 2 నుంచి 23వ తేదీ మధ్య తెరవాలని స్పష్టం చేసింది. తొలిగా ప్రీమెట్రిక్‌ వసతిగృహాల్లో 9, 10 తరగతి విద్యార్థులకు, పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాల్లో ఇంటర్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది. ప్రత్యేక వసతిగృహాల్లో 8, 9, 10 తరగతులకే ప్రవేశాలు కల్పించాలని స్పష్టంచేసింది. మిగతా తరగతుల విద్యార్థుల ప్రవేశాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించింది. విద్యార్థుల ప్రవేశానికి తల్లిదండ్రుల సమ్మతి పత్రం తప్పనిసరని పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘వసతిగృహ సంక్షేమ అధికారులు తక్షణం విధుల్లో చేరాలి. ఆ పరిసరాల్లో విద్యార్థులు తరచూ ముట్టుకునే ప్రాంతాలన్నింటినీ శానిటైజ్‌ చేయాలి. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో గదులు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయించాలి’ అని ఆదేశించింది.

30వ తేదీ వరకు ప్రవేశాలు
‘విద్యార్థులకు వసతిగృహాల్లో ఈనెల 30వ తేదీ వరకు ప్రవేశాలు కల్పించాలి. రెన్యువల్‌ అడ్మిషన్లను 15వ తేదీలోపు చేపట్టాలి. ప్రవేశాల మెరుగుదలకు స్థానిక గ్రామాలు, ఎస్సీ కాలనీలను అధికారులు సందర్శించి ప్రచారం చేయాలి. విద్యార్థుల ప్రవేశాలకు పరిధిని ఎంపిక చేయాలి. బాలుర విషయంలో 5 కి.మీ. నిబంధనను కచ్చితంగా పాటించాలి. కాస్మొటిక్‌ ఛార్జీల చెల్లింపునకు ఆధార్‌కార్డు అనుసంధానిత బ్యాంకు ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వసతిగృహ విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక అందేలా చూడాలి. జిల్లా కొనుగోలు కమిటీ నిర్ధారించిన ధరలకే కూరగాయలు, గుడ్లు కొనుగోలు చేయాలి. పాలను విజయ విక్రయ కేంద్రాల నుంచే సేకరించాలి. అవి అందుబాటులో లేకపోతే స్థానిక మార్కెట్‌లో కమిటీ సూచించిన ధరలకే కొనుగోలు చేయాలి. విద్యార్థుల హాజరు సంఖ్యకు అనుగుణంగా వీటి కొనుగోలు ఉండాలి’ అని పేర్కొంది.

ఇవీ చదవండి

కళకళలాడుతున్న జలాశయాలు.. రబీ పంటలపై ఆశలు

ABOUT THE AUTHOR

...view details