ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కృష్ణాలో సాఫీగా సాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్

By

Published : Jan 16, 2021, 7:11 PM IST

కొవిడ్ వ్యాక్సినేషన్​ను ప్రక్రియను విజయవాడలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం జగన్​ ప్రారంభించారు. కృష్ణా వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్త పుష్పకుమారికి.. రాష్ట్రంలో మొదటగా వ్యాక్సిన్ అందించారు.

covid vaccination in krishna district
కృష్ణాలో మొదటి విడత టీకా పంపిణీ

కృష్ణా జిల్లావ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించి, పర్యవేక్షించారు. మొదటి విడతలో ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

కృష్ణాలో మొదటివిడత కరోనా టీకా పంపిణీ

విజయవాడలో...

విజయవాడలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం జగన్ కొవిడ్ టీకా పంపిణీని ప్రారంభించారు. తొలుత జీజీహెచ్​కు చేరుకున్న సీఎం జగన్​కి.. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కె. భాస్కర్, కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు స్వాగతం పలికారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, సాంకేతిక అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆరోగ్య కార్యకర్త పుష్పకుమారికి వైద్యులు తొలి టీకా వేశారు.

విజయవాడ శివారు కండ్రిక పీహెచ్​సీలో కొవిడ్ వ్యాక్సినేషన్​కు వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నర్సులు, ఆశా కార్యకర్తలకు ముందుగా టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేసిన తరువాత కొన్ని గంటల పాటు తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.

కండ్రికలో వైద్య సిబ్బందికి టీకా పంపిణీ

మచిలీపట్నంలో...

కొవిడ్ మరణాలను అరికట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల వల్ల లక్షల మంది కరోనాను జయించారన్నారు. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మందికి టీకా వేస్తున్నామని.. విడతల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు.

కంచికచర్ల, వీరులపాడులో...

కంచికచర్ల, వీరులపాడు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో.. శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కంచికచర్లలో 100, వీరులపాడులో 101 మంది ఆరోగ్య సిబ్బందికి తొలిరోజు టీకా వేయనున్నారు. కంచికచర్ల తొలి వ్యాక్సిన్ డాక్టర్ శ్రవణ్ కుమార్​కు వేశారు. టీకా వేసేటప్పుడు నొప్పి అనిపించలేదనీ.. అంతా బాగానే ఉందని ఆయన తెలిపారు. ఏదైనా ప్రతికూలత ఎదురైతే వెంటనే నందిగామ వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సిద్ధంగా ఉంచినట్లు పీహెచ్​సీ వైద్యులు దీప్తి స్పష్టం చేశారు. మొదట ఆరోగ్య సిబ్బందికి, తర్వాత మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని కంచికచర్ల తహసీల్దార్ విజయ్ కుమార్ వెల్లడించారు.

కంచికచర్లలో కరోనా టీకా తీసుకుంటున్న వ్యక్తి

పమిడిముక్కలలో...

పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ముందుగా అక్కడి ఆరోగ్య పర్యవేక్షణాధికారి చండిక రాజా మురళీకృష్ణ టీకా తీసుకున్నారు. ఈ రోజు వంద మందికి వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడి ఆయాలు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశమంతటా వ్యాక్సినేషన్ జరుగుతోందని.. దీని గురించి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు.

కపిలేశ్వరపురంలో టీకా పంపిణీ

పెనుగంచిప్రోలు, వత్సవాయిలో...

పెనుగంచిప్రోలు, వత్సవాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ సాఫీగా సాగుతోంది. తొలివిడతగా పెనుగంచిప్రోలులో 100, వత్సవాయిలో మరో 100 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సినేషన్​కి సంబంధించి సిబ్బందికి పంపించిన ఓటీపీ సమాచారం కొంత ఆలస్యమైనా, అందరికీ చేరినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు.

పెనుగంచిప్రోలులో టీకా తీసుకుంటున్న వైద్య సిబ్బంది

ఉంగుటూరులో...

ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి పీహెచ్​సీలో వ్యాక్సినేషన్​ను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రారంభించారు. వైద్యాధికారులతో పాటు 100 మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇక్కడ టీకాలు వేయనున్నారు. తహసీల్దార్ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీనివాసరావు, వైద్యులు శిరీష, రాము.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్దఅవుటుపల్లిలో టీకా పంపిణీ

బాపులపాడులో...

బాపులపాడు మండలం వీరవల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. మొదట విడతగా ఆరోగ్య సిబ్బందికి టీకా అందిస్తున్నామని వైద్య అధికారులు తెలిపారు.

బాపులపాడులో టీకా ప్రక్రియ

ఇదీ చదవండి:

వ్యాక్సినేషన్​ను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details