ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగుల ఉద్యమం అనివార్యం.. తాడోపేడో తేల్చుకోవాల్సిందే : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

By

Published : Mar 28, 2023, 10:21 PM IST

Updated : Mar 29, 2023, 6:29 AM IST

employees struggle : తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, నాయకులు విజ్ఞత ప్రదర్శించి ఐక్యపోరాటాలను నడిపించాలని.. లేకపోతే ఉద్యోగులే రోడ్లపైకి రావడానికి రెడీగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఏపీజీఈఏ తరఫున ఏప్రిల్ లో రాజమండ్రి వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగుల ఉద్యమం
ఉద్యోగుల ఉద్యమం

employees struggle : ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ లను నియంత్రించే అధికారం గవర్నర్ కే ఉందని.., ఆయన పేరు మీద ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. అందుకే తాము గవర్నర్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నామన్నారు. కృష్ణా జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టం చేయడం ద్వారానే ఉద్యోగుల సొమ్ముకు భద్రత ఉంటుంది కాబట్టి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. శాసన సభ్యులు చట్టం చేయాలని.., వారిని కలిస్తే తమకు రాజకీయాలను ఆపాదిస్తారనే కలవలేదన్నారు. గవర్నర్ ను కలవడం ఏరకంగా నేరం అవుతుందో తమకు నోటీసు ఇచ్చిన ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. అవసరమైతే 371 డి అధికరణ ద్వారా రాష్ట్రపతి ని కలుస్తామని గతంలో ఓ సందర్భంలో చెప్పానని గుర్తు చేశారు.

ఆఖరి రూపాయి చెల్లించే వరకూ.. ఉద్యోగికి ప్రభుత్వం బాకీ పడిన ఆఖరి రూపాయి చెల్లించే వరకూ తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. తమ ఉద్యమం ఎలా ఉండాలనేది.. త్వరలోనే ఓ సమావేశం పెట్టి కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు. నాయకత్వం మాత్రమే సొంత ఎజెండాతో ముందుకు వెళ్లదని.., విరమించాల్సి వచ్చినా.. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు. సీనియర్ ఉద్యోగ సంఘం నాయకుడిగా వ్యక్తిగత ప్రతిష్టలకు ఎవరూ పోవద్దని కోరుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులంతా ఆందోళనకు దిగడం అనివార్యమని.., నాయకులంతా ఐక్యంగా ముందుకు వస్తే మంచిదన్నారు. ఉద్యోగులంతా ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కేవలం తమ సంఘాన్నే చర్చలలో ఉండకూడదని ఎందుకు కోరుకుంటోందని ప్రశ్నించారు. సంఘాలకు అతీతంగా ఉద్యోగులంతా ఉద్యమంలో ఉంటారని బలంగా నమ్ముతున్నామన్నారు.

తాడోపేడో తేల్చుకునే విధంగా... ఏప్రిల్ మూడో వారంలో మొదలుపెట్టే ఉద్యమం తాడో పేడో తేల్చుకునే విధంగా ఉంటుందని సూర్యనారాయణ స్పష్టం చేశారు. అందరినీ సమాయాత్తం చేసి... రాజమండ్రి వేదికగా తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు చేస్తున్న మోసాలను కూడా వివరిస్తామని చెప్పారు. తమకు రావాల్సిన అన్నిరకాల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు, భవిష్యత్ చెల్లింపులకు చట్టబద్ధత.., రాజకీయ పరంగా ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలను పూర్తిగా అమలు చేయాలనేదే తమ డిమాండ్లు అని స్పష్టం చేశారు.

గవర్నర్ పేరున వచ్చే ఉత్తర్వులు అమలు చేయడం లేదు. గవర్నర్ ఉత్తర్వులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ఉద్యోగికి సంబంధించిన ప్రతి రూపాయి చివరి వరకు చెల్లించాలి. ఆమేరకు ఉద్యోగుల్లో నమ్మకం కలిగించేలా చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. శాసనసభా పక్ష నేతలు, ప్రతి పక్ష నాయకులను కలిసి విన్నవిస్తే రాజకీయాలు ఆపాదించే ప్రమాదం ఉందన్న ఆలోచనతో మేం గవర్నర్ ను కలిసి మా సమస్యలపై విన్నవించాం. ఉద్యోగుల సమస్యలపై చేసే ఉద్యమానికి ఆయా సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు, భవిష్యత్ చెల్లింపులకు చట్ట భద్రత, రాజకీయ హామీల అమలు డిమాండ్లతో ఏప్రిల్ నుంచి జరిగే ఉద్యమానికి మా సంఘం తరఫున ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. - సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఏపీ అమరావతి ఉద్యోగుల ఆందోళన... పెంచిన పేస్కేళ్లను నాలుగేళ్లైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటం దారుణమని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఆక్షేపించింది. ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన వాటి నుంచి కూడా తప్పుకోవడం దారుణమని ఆ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. 11 పీఆర్సీ కమిషనర్ సిఫార్సు చేసిన స్కేళ్ల పెరుగుదలను అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని .. కంటి తుడుపు చర్యగా ప్రభుత్వ వ్యవహారం ఉందని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా విజయవాడలోని స్టాంపులు రిజిస్ట్రేషన్, గిరిజన సంక్షేమ కమిషనర్ తదితర హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగులను కలిసి కొద్దిసేపు ఆయా కార్యాలయాల వద్ద నిరనస తెలియజేశారు. ఒకటో తేదీన జీతాలు, పెండింగ్ బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు , హెల్తు కార్డులు తదితర అంశాలపై ఉద్యోగులంతా ఆందోళనలో ఉన్నట్టు బొప్పరాజు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తున్నారని 27 తేదీ నుంచి కారుణ్య నియామకాలు ఇవ్వని కుటుంబాలను పరామర్శ కార్యక్రమం చేపట్టామన్నారు. ఏప్రిల్ 5 తేదీన మరోమారు సమావేశమై తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 29, 2023, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details