ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Robbery in Samarlakota: సినీఫక్కీలో దారిదోపిడి.. ఆటోలో హల్​చల్​ చేసిన దుండగులు..

By

Published : Jun 13, 2023, 8:44 AM IST

Robbery in Samarlakota: సినీ ఫక్కీలో దారిదోపిడి ఘటన కాకినాడ జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు దుండగులు ప్రయాణికుల వేషంలో వచ్చి ఓ ఆటో డ్రైవర్​ను కత్తితో పొడిచి పాసింజర్ల నుంచి బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..

Robbery in Samarlakota
సామర్లకోటలో దారిదోపిడి

Robbery in Samarlakota: కాకినాడ జిల్లా సామర్లకోటలో ఇద్దరు దొంగలు రెచ్చిపోయారు. ఓ ఆటో డ్రైవర్​ను కత్తితో పొడిచి.. ప్రయాణికులపై దాడి చేసి.. సినీఫక్కీలో దారిదోపిడి చేసిన ఘటన జరిగింది. సోమవారం రాత్రి సామర్లకోట స్టేషన్​ సెంటర్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పాసింజర్లుగా రోడ్డుపై నిలబడ్డారు. అంతకుముందే ఆ దుండగులు ఆటోస్టాండ్​లో నిలబడి రెక్కీ నిర్వహించారు. మహిళలగా ఎక్కువగా ఉన్న ఆటోలను ఎంచుకుని ప్రయాణికులుగా ఆటోను నిలుపుదల చేశారు. ఆటో డ్రైవర్​ కూడా ఇద్దరు పాసింజర్స్ దొరికారని ఆనందంతో ఆటో ఆపి ఇద్దరినీ తనకు రెండు వైపులా కూర్చోబెట్టుకున్నాడు.

ఆటోలో ఎనిమిది మంది మహిళలు, డ్రైవర్​తో కలిపి తొమ్మిది మంది ఉన్నారు. ఇద్దరు దుండగులతో కలిపి మొత్తం 11మందితో రాత్రి సమయంలో ఆటో పిఠాపురం నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో సామర్లకోట శివారు నిర్జీవ ప్రదేశానికి వెళ్లేసరికి ఆటోలో ఉన్న ఇద్దరు దుండగులు వారి పని మొదలుపెట్టారు. దుండగుల్లో ఒకడు కత్తిని తీసుకుని ఆటో డ్రైవర్ పొట్టలో పొడిచి, రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి ఈడ్చుకుని పోయాడు. ప్రయాణికుల్లో సామర్లకోట శివారు కోదండరామ పురానికి చెందిన రమ్య అనే మహిళ సెల్​ ఫోన్​ బయటకు తీస్తుండగా అది గమనించిన మరో దుండగుడు ఆమె వద్ద ఉన్న మొబైల్ లాక్కొని, ఆమె తలను రోడ్డుకువేసి బలంగా మొదాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయం అయింది.

మిగిలిన మహిళలను కూడా దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఒక మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని వారిని చంపుతామని బెదిరించారు. ప్రయాణికుల ఆక్రందనలు భీకరమైన వాతావరణం చూసి అక్కడ నుంచి దుండగులిద్దరూ పరారయ్యారు. ఒక వ్యక్తి పక్కనే ఉన్న పంట పొలాల మీదుగా పరారవ్వగా.. మరో వ్యక్తి పిఠాపురం వైపు వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన ఆక్రందనలతో ఉన్న మహిళలను చూసి వెనుక వస్తున్న ఆటో డ్రైవర్లు వారి వాహనాలను ఆపి కత్తిపోటుకు గురైన ఆటో డ్రైవర్​ను, గాయాలపాలైన మహిళలను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. కోదండ రామ పురానికి చెందిన రమ్యను సామర్లకోటలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ తరలించారు.
ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన ఇద్దరు దుండగులూ.. హిందీ భాషను మాట్లాడారు. దీంతో వారిద్దరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. సినీ ఫక్కీలో ఇటువంటి దాడి దోపిడీ జరగడంతో ఇటు ప్రయాణికులు అంటే పట్టణవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న సామర్లకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పిఠాపురం, సామర్లకోటలోని ఆసుపత్రులకు చేరుకుని క్షతగాత్రుల నుంచి వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసులను నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details