ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జగన్​ సరికొత్త వ్యూహం

By

Published : Dec 8, 2022, 9:47 PM IST

Updated : Dec 9, 2022, 10:00 AM IST

Jagan meet with YSRCP leaders: ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన సీఎం జగన్‌... ఆ యుద్ధానికి వైసీపీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా తీసుకుని ఒక్కో దానికి ముగ్గురేసి చొప్పున. మొత్తంగా 45 వేలమంది సమన్వయకర్తలను నియమించాలని స్పష్టం చేశారు. అలాగే ‘గృహసారథుల’ పేరుతో ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళను, ఒక పురుషుడిని పార్టీ వాలంటీర్లుగా నియమించాలన్నారు. గురువారం ఆయన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల పర్యవేక్షకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైనాట్‌ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్న జగన్‌... పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని నిర్దేశించారు.

jagan
jagan

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జగన్​ సరికొత్త వ్యూహం

Jagan Election Plan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో.. గడపగడపకూ వైసీపీని తీసుకెళ్లేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వివరించారు. ప్రభుత్వ పరంగా గడప గడపకు కార్యక్రమం జరుగుతోందని.. పార్టీ తరపున 10 నుంచి 15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను కలుసుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్‌ చేస్తామన్నారు.

పార్టీ ఆధ్వర్యంలో గృహ సారథులు పేరిట వాలంటీర్లను, సమన్వయకర్తలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి 50ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ– గృహసారథులుగా ఉంటారని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పార్టీతరఫున ముగ్గురు సమన్వయకర్తలను నియమించాలని సీఎం ఆదేశించారు. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉండాలన్నారు. రాజకీయ అవగాహన, చురుగ్గా ఉన్నవారిని ఎంపికచేయాలని నిర్దేశించారు. మొత్తంగా 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు, 45 వేల మంది కన్వీనర్లు ఉంటారని సీఎం తెలిపారు.

డిసెంబర్ 20 లోగా కన్వీనర్ల ఎంపిక పూర్తి చేయాలని, తర్వాత ప్రతి 50 ఇళ్ల క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహసారథులను ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలన్నారు. పార్టీ సమన్వయకర్తలు, గృహ సారథుల పనితీరుపై నిరంతరం మదింపు ఉంటుందని, వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుందన్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారన్నారు. సంక్షేమ పథకాల సాయం పంపిణీకి తాను బటన్‌ నొక్కడమే కాదు.. క్షేత్రస్థాయిలో నెట్‌వర్క్‌ కూడా బలంగా ఉండాలని సీఎం అన్నారు. ‘వై నాట్‌ 175’ అనేదే లక్ష్యం కావాలన్నారు.

ఎమ్మెల్యేలను బలోపేతం చేసేందుకే క్షేత్రస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల పర్యవేక్షకులు పార్టీని గెలిపించుకుని రావాల్సిందేనన్నారు. అలా పని చేయగలమంటేనే ఉండండన్న సీఎం.. లేదంటే ఇప్పుడే చెప్పేయాలన్నారు. కొత్తవారిని నియమిస్తానన్నారు.పార్టీకి నష్టం జరిగితే మాత్రం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుపై నాలుగు రకాల వ్యవస్థలతో నిరంతర నిఘా ఉందని సీఎం అన్నట్లు తెలిసింది. ప్రత్యర్థులతో పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చన్న సీఎం..పార్టీలోనే నాయకుల మధ్య అంతర్గత విభేదాలుంటే వాటన్నింటినీ పక్కనపెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.

ఇప్పటికే ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లున్నారు. వారంతా దాదాపు వైకాపాకు చెందినవారే. అయితే వారు ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ఉన్నందున పార్టీకి అనుకూలంగా ఎన్నికలకు వినియోగించుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురు కావచ్చనే ఆలోచనతో.. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా పక్కాగా పార్టీ వాలంటీర్లను నియమించేందుకు సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథుల పేరుతో నియమించాలని పార్టీ బాధ్యులను ఆదేశించారు. వీరు ఇప్పటికే ఉన్న వాలంటీర్లతో కలిసే పనిచేయనున్నారు.

వారికి కేటాయించిన 50 ఇళ్లలోని వారికి ప్రభుత్వం పథకాలు అందాయో లేదో కనుక్కోవడం.. అందకపోతే అందేలా చేయడం.. ప్రభుత్వ పథకాలపై వివరించడం, పార్టీ కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకువెళ్లడం వంటి పనులు చేస్తారు. ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా పోలరైజేషన్‌ పక్కాగా జరిగేలా ఐ-ప్యాక్‌ బృందం ఈ కార్యాచరణను సిద్ధం చేసిందని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని కొంతవరకైనా తగ్గించగలిగేలా పార్టీ వాలంటీర్లను వినియోగించనున్నారు. ఎన్నికలకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఇలా ఇంటింటికీ పార్టీ యంత్రాంగాన్ని పంపే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పేర్ని నాని వివరించారు.

వైసీపీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఇద్దరు పార్టీ వాలంటీర్లను నెలలోగా నియమించాలని సీఎం ఆదేశించారు. సచివాలయానికి ముగ్గురు చొప్పున పార్టీ కన్వీనర్ల నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రెండు రాష్ట్రాలను కలపాలన్నా ఇప్పుడు కుదరదు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగింది. విడిపోయాక ఎవరి పాలన వారు చేసుకుంటున్నాం. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలపై పోరాడతాం. సైనిక వాహనాల రంగును ఇతర వాహనాలకు వేయకూడదు.మోటారు వాహనాల చట్టంలో సైనిక రంగులపై నిషేధం ఉంది. పవన్ తెచ్చిన వాహనం ఎక్కడా రిజిస్ట్రేషన్ కాదు. ఆయన తన ప్రచార వాహనానికి పసుపురంగు వేసుకోవాలి. -పేర్ని నాని, మాజీ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated :Dec 9, 2022, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details