ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Turmeric Farmers: పెట్టుబడి భారమై.. గిట్టుబాటు ధర రాక

By

Published : May 4, 2023, 5:08 PM IST

Turmeric Farmers State Conference: గిట్టుబాటు ధర కల్పించి పసుపు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.. రాష్ట్ర పసుపు రైతుల సమాఖ్య డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగిన రాష్ట్ర సదస్సులో 26 జిల్లాల అన్నదాతలు, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు.

Turmeric Farmers State Conference
పసుపు రైతుల రాష్ట్ర సదస్సు

పసుపు రైతుల రాష్ట్ర సదస్సు వీడియో

Turmeric Farmers State Conference: రాష్ట్రంలో పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు కుదేలయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదని పసుపు రైతుల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది వర్షాలతో దిగుబడి కూడా తగ్గిందని, గతేడాది క్వింటా 6 వేల 800 రూపాయలు పలికిన పసుపు ధర.. ఇపుడు 4 వేల 800 రూపాయలకు పడిపోయిందని రైతులు వాపోయారు. వానలకు పసుపు తడవడంతో మరో వెయ్యి రూపాయల కోత వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

2021లో రాష్ట్ర ప్రభుత్వం 6 వేల 850 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతో రైతులు ఉత్సాహంగా పసుపు పంట వేశారు. విశాఖలో 5 వేల 771, గుంటూరులో 4 వేల 901, కడపలో 4 వేల 96, కర్నూలులో 15 వందల 10 హెక్టార్లలో పసుపు వేశారు. రెండేళ్లుగా పసుపు ఉత్పాదక ఖర్చులు, కౌలు భారీగా పెరగడంతో ఎకరాకు లక్షా 50 వేల రూపాయల నుంచి లక్షా 70 వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతోంది. ఈ మేరకు మార్కెట్లో పసుపు ధర మాత్రం పడిపోవడంతో చివరకు నష్టాలే మిగులుతున్నాయన్న రైతులు.. 10 వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం 23 రకాల పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించినా అందులో పసుపు పంటకు స్థానం కల్పించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డుతో పాటు కొనుగోలు కేంద్రాలు, పసుపు ఆధారిత పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు.

"గత సంవత్సరం రెండున్నర ఎకరాల్లో పసుపు పంట వేశాను. దాన్ని 6,500 రూపాయలకు అడిగితే నేను మా గ్రామంలో అమ్మలేదు. అయితే ఇప్పుడు పసుపు ధర అంతకంటే ఇంకా పడిపోయింది. ఇప్పుడు పసుపు పంట ధర రూ.4,500లు పలుకుతోంది. పైగా పసుపు పంటను నిల్వ చేసేందుకు మాకు అద్దె ఖర్చు అదనపు భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము" - శ్రీనివాసుల రెడ్డి, రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details