ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఏపీ కిమ్' కర్తవ్యం ? తెలంగాణ నూతన ప్రభుత్వంతో స్నేహం కుదిరేనా?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 6:23 AM IST

Telangana Election Result Effect on Jagan Govt: తెలంగాణలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రంతో జగన్​మోహన్​రెడ్డి సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. 'ఏపీ కిమ్ అంటూ ప్రతిపక్షాలు ముద్దుగా పిలుచుకొనే జగన్ దుందుడుకుగా వ్యవహరిస్తారా? విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారా? అందుకు కాంగ్రెస్ సహకరిస్తుందా?

TG_Effect_on_Jagan_Govt
TG_Effect_on_Jagan_Govt

What Next Jagan Strategy with Telangana:ఉమ్మడి రాష్ట్ర విభజనాంతరం తెలంగాణలో తొలిసారిగా అధికార మార్పిడి జరిగింది. ఎగ్జిట్​ పోల్స్ ప్రకటించినట్లుగానే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రంతో జగన్​మోహన్​రెడ్డి సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. 'ఏపీ కిమ్ అంటూ ప్రతిపక్షాలు ముద్దుగా పిలుచుకొనే జగన్ దుందుడుకుగా వ్యవహరిస్తారా? విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారా? అందుకు కాంగ్రెస్ సహకరిస్తుందా? తెలుగు రాష్ట్రాల మధ్య మునపటి మాదిరి సహృద్భావ వాతావరణం ఉంటుందా? అనేది వేచిచూడాల్సిందే.

కాంగ్రెస్​ ఉనికిని దెబ్బతీసిన జగన్​
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీతో సీఎం జగన్‌కి తీవ్రస్థాయిలో విరోధాలున్నాయి. కాంగ్రెస్​ ఉనికిని దెబ్బతీస్తూ వైసీపీని ఏర్పాటు చేయడం మొదలుకుని తెలంగాణలో బీఆర్​ఎస్​తో స్నేహ సంబంధాలు నెరపడం, అంతకు మించి కేంద్రంలోనూ తమకు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్​ అధిష్ఠానం గుర్రుగా ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి బీజేపీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారు. సరికదా తాము వ్యతిరేకమనే విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. పార్లమెంటు(లోక్​సభ, రాజ్యసభ)లో అత్యధిక స్థానాలు కలిగిన ప్రాంతీయ పార్టీలో వైసీపీ ఒకటి. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన 'ఇండియా' కూటమికి బీఆర్​ఎస్​, వైసీపీ దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ యాక్టివ్ అయ్యేందుకు కాంగ్రెస్అడుగులువేస్తోంది.

ఏపీలోనూ అధికార పార్టీపై వ్యతిరేకత
కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ఉపయోగపడ్డట్టే ఏపీలోనూ అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో అప్పటి టీఆర్​ఎస్(బీఆర్​ఎస్​)​కు వ్యతిరేకంగా కలిసి పోటీ చేసిన టీడీపీ, కాంగ్రెస్ ఓటమి పాలయ్యాయి. తమకు వ్యతిరేకంగా పనిచేశారనే కోపంతో ఏపీలో టీడీపీ ఓటమికి అప్పటి టీఆర్​ఎస్ పక్కా ప్రణాళికలు అమలు చేసింది. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి టీఆర్ఎస్ నేతలు సహకరించారు. నాటి నుంచి నేటి దాకా ఇరు పార్టీలు పూర్తి స్థాయిలో స్నేహ సంబంధాలు కొనసాగించాయి. ఇక తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్​కు సహకరించిందనే వాదన కూడా ఉంది. ఈ లెక్కన ఏపీలో కాంగ్రెస్ నాయకులు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి సహకరించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పదేళ్లుగా పేరుకుపోయిన విభజన సమస్యలు
విభజన సమస్యలకు తోడు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, ఆర్టీసీ సహా ఆస్తుల పంపిణీ దాయాది రాష్ట్రాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయనున్నాయి. వీటి పరిష్కారాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ కారణాలతో వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లు బీఆర్​ఎస్​తో అంటకాగింది. ఇరువురి స్నేహం ఫలితంగానే జగన్​మోహన్​ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయ సమ్మతంగా దక్కాల్సిన వాటాలపై కిమ్మనకుండా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన మొదలుకుని పలు విషయాల్లో స్నేహపూరకంగా వ్యవహరించారు.

తాజాగా తెలంగాణలో పోలింగ్​ ముందు రోజు అర్ధరాత్రి నాగార్జున సాగర్​ డ్యాంపై ఏపీ పోలీసులు జరిపిన దాడి బీఆర్​ఎస్​కు లబ్ధి చేకూర్చేందుకే అని ప్రతిపక్ష, వామపక్ష నాయకులు వైసీపీ కుట్రలు బయటపెట్టారు. ఇదిలా ఉంటే హైదరాబాద్​లో అధికార పార్టీ నాయకుల వ్యాపారాలు, అవినీతి, హత్యా ఆరోపణల కేసులు ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల వివాదాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత ముదిరి పాకాన పడనున్నాయా అని జనం చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్​ పార్టీకి జోష్​ తీసుకొచ్చి - అన్నీ తానై వన్​ మ్యాన్​ ఆర్మీ షో

ABOUT THE AUTHOR

...view details