ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు.. లబోదిబోమంటున్న లబ్ధిదారులు

By

Published : Jan 24, 2023, 7:42 AM IST

Jagananna Colonies
జగనన్న కాలనీలు ()

Beneficiary Problems of Jagananna Colonies: ఇంటి స్థలం ఇచ్చిందని సంబరపడ్డారు. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని ముఖ్యమంత్రి మాటలు చెప్తే పొంగిపోయారు. తీరా పనుల దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేయడంతో.. ఇప్పుడు లబ్ధిదారులు ఉసూరుమంటున్నారు. సర్కారు ఇస్తామన్న నిధులు చాలవు.. సొంతంగా అప్పు తెచ్చి కడితే తిరిగి రావు.! పునాదులు, మొండి గోడల మధ్యే నలిగిపోతున్నారు.. ఉమ్మడి గుంటూరు జిల్లా జగనన్న కాలనీల లబ్ధిదారులు.

Beneficiary Problems of Jagananna Colonies: ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. జగనన్న కాలనీల్లో లక్షా 13 వేల 948 ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు 78వేల 74ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఐతే వీటిలో పూర్తైంది కేవలం 15 వేలు మాత్రమే. మిగతావి చాలావరకూ పునాదుల దశలోనే నిలిచిపోయాయి. లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాలనీలు కాదు ఊళ్లే కడుతామని చెపుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థలం ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. కేంద్రం ఇచ్చే లక్షా 80వేల రూపాయల నిధులనే లబ్ధిదారులకు అందిస్తూ.. వాటితోనే సరిపెట్టుకోవాలని చెప్తోంది. అవి ఏ మాత్రం చాలడంలేదు. ఇంటి పునాది దశ దాటేందుకే.. లక్షకు పైగా ఖర్చవుతోంది. నిర్మాణం పూర్తవడానికి ఎంత లేదన్నా.. 5లక్షలు అవసరమని అంచనా. కేంద్రం ఇచ్చే డబ్బు మినహాయిస్తే.. మిగతా 3లక్షల కోసం అప్పులు చేయక తప్పటం లేదు. డబ్బులు ఉన్నవారు మాత్రం నిర్మాణాలు కొనసాగిస్తుండగా లేనివారు నిర్మాణాలు మధ్యలోనే ఆపేస్తున్నారు. చేసేదిలేక చాలామంది పూరి గుడిసెల్లో, అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు.

కొందరైతే కాలనీల్లో రోడ్లు, నీళ్లు, విద్యుత్‌ వంటి మౌలిక వసతుల్లేక.. నిర్మాణాలకు ముందుకు రావడంలేదు. కానీ అధికారులు మాత్రం లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే.. ఇంటి పట్టాను రద్దు చేసి.. మరొకరికి ఇస్తామని బెదిరిస్తున్నారు. ఆ ఒత్తిళ్లు భరించలేక.. కొందరు లబ్ధిదారులు అప్పులు చేసి పనులు మొదలు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల డ్వాక్రా సభ్యులుగా ఉన్న వారికి బ్యాంకుల ద్వారా 30 వేల రుణం ఇప్పించి ఇంటి పనులు మొదలు పెట్టిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే ఇంటి నిర్మాణం కొలిక్కివస్తుందని.. లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు. నివాసానికి వీలుగా మౌలిక వసతులూ కల్పించాలని కోరుతున్నారు

"మాకు మొదటి విడతలో 33 వేల రూపాయలు వచ్చాయి. తరువాత పనులు ఆపేశాము. డబ్బులేక అప్పు తీసుకొని కట్టాల్సిన పరిస్థితి ఉంది". - మౌలాబి, రేవేంద్రపాడు

"ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపోవడం లేదు. వాళ్లని కట్టి ఇమ్మంటే.. మమ్మల్నే కొంత డబ్బులు అడుగుతున్నారు. వాటికి పిల్లర్లు కూడా వేయరు అంట. తినడానికే కష్టంగా ఉన్న మాకు.. అంత మొత్తం పెట్టి ఇల్లు ఎలా కట్టించగలం. స్థలం కూడా ఊరికి చాలా దూరంలో ఇచ్చారు". - పోలమ్మ,రేవేంద్రపాడు

జగనన్న కాలనీల లబ్ధిదారుల సమస్యలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details