ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPM Porukeka padayatra: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తారా?.. ఉద్యమాన్ని ఉధృతం చేయమంటారా: సీపీఎం

By

Published : Jul 1, 2023, 6:00 PM IST

Updated : Jul 1, 2023, 6:39 PM IST

CPM Polavaram Porukeka Maha Padayatra updates: పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని సీపీఎం నాయకులు ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

CPM
CPM

CPM Polavaram Porukeka Maha Padayatra updates: పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, పరిహారం పూర్తిగా అమలు చేయాలని.. పునరావాసం పూర్తయ్యే వరకూ ముంపు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలంటూ.. గత 11 రోజులుగా 'పోలవరం నిర్వాసితుల పోరుకేక' పేరుతో సీపీఎం ఆధ్వర్యంలో మహా పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా సీపీఎం నాయకులు పలు జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. అంతేకాకుండా, నిర్వాసితులకు.. పునరావాసం, పరిహారం పూర్తిగా అమలు చేసేవరకూ గ్రామాలు ఖాళీ చేయించరాదంటూ సభలు, రౌండ్ టేబులు సమావేశాలు నిర్వహించి.. అధికార పార్టీ నాయకులకు వినతిపత్రాలను అందజేస్తున్నారు.

12వ రోజుకు చేరినా సీపీఎం పోరుకేక మహాపాదయాత్ర.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలంటూ.. సీపీఎం ఆధ్వర్యంలో జూన్‌ 20వ తేదీన 'పోలవరం నిర్వాసితుల పోరుకేక' పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామం నుండి మహా పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర భాగంలో వందలా మంది సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, ప్రజలు, యువత పాల్గొంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. నేటి 12వ రోజు పాదయాత్రలో పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సీపీఎం స్థానిక నాయకులు.. గుంటూరులో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును కలిసి, వినతిపత్రం అందించారు. నిర్వాసితులకు పునరావాసం, పరరిహారం పూర్తిగా అమలు చేసేవరకూ గ్రామాలు ఖాళీ చేయించరాదని మంత్రిని కోరారు. పునరావాసం పూర్తయ్యేవరకు ముంపు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని, 1986, 2022 నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాల రీసర్వే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.దీంతో మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ఈ నెల 5వ తేదీన ఓ ప్రత్యేక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలియజేశారు.

ప్రాజెక్టు డిజైన్ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు డిజైన్ సరిగ్గా లేదని మండిపడ్డారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తుందని ఆగ్రహించారు. మోదీ ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. 37 మీటర్ వరద నీరు చేరుకుంటేనే సుమారు 193 గ్రామాలు నీటన ములిగాయన్న ఆయన..పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని గత 12 రోజుల నుండి పాదయాత్ర చేస్తున్నా.. ప్రభుత్వాలు స్పందించటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు చట్ట ప్రకారం పునరావసం కల్పించి, వరదల్లో మునిగిన గ్రామాలన్నింటిని ముంపు గ్రామాలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్‌పై సీపీఐ రామకృష్ణ నిప్పులు..మూడు లక్షల మంది గిరిజనులు, గిరిజనేతర ప్రజల త్యాగాలతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒప్పించి ఒక్కటి కూడా సాధించలేకపోయిందని.. ఏలూరు నగరంలోని ఆర్ఆర్‌పేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని స్టీల్ ఫ్యాక్టరీకి నాలుగు సార్లు శంకుస్థాపన జరిగితే, అందులో జగన్ రెడ్డే రెండు సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి కావాలన్నారు. దీంతోపాటు ఈ రాష్ట్రానికి అమరావతే రాజధాని కావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలన్న రామకృష్ణ.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.30 వేల కోట్లు నిధులు రావాల్సి ఉందని గుర్తు చేశారు.

పోరుకేక మహాపాదయాత్రకు కుల వివక్ష పోరాట సమితి మద్దతు.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు చేపట్టిన పోరుకేక మహాపాదయాత్రకు దళిత, గిరిజన, ప్రజాసంఘాల తరపున మద్ధతు తెలుపుతున్నామని.. కుల వివక్ష పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. విజయవాడలో పోలవరం నిర్వాసితుల పోరుకేక పాదయాత్రకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాసం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. నిర్మాణం, నిర్వాసితుల పునరావసానికి అయ్యే నిధులన్నీ కేంద్రమే కేటాయించాలన్నారు. పునరావాసం పూర్తి చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయడం అంటే నిర్వాసితులను గోదాట్లో ముంచడమే అన్నారు. తక్షణమే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, లేదంటే భవిష్యత్తులో నిర్వాసితులతో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Last Updated : Jul 1, 2023, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details