ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించిన పంచుమర్తి అనురాధ.. స్ఫూర్తిదాయక ప్రస్థానం

By

Published : Mar 24, 2023, 9:08 AM IST

Inspiring story of Panchumarthi Anuradha: ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం.! చిన్న వయస్సులోనే వివాహం. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయ ప్రవేశం. 26 ఏళ్లకే విజయవాడ మేయరుగా ఎన్నిక. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో.. ఎమ్మెల్సీగా సంచలన విజయం. ఇదీ పంచుమర్తి అనురాధ స్ఫూర్తిదాయక ప్రస్థానం.

Panchumarthi Anuradha
పంచుమర్తి అనురాధ

Inspiring story of Panchumarthi Anuradha: అది 1999 సంవత్సరం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. రాజకీయాల్లోకి తటస్థులను ఆహ్వానిస్తున్న సందర్భం. పేపర్లో చదివి.. ఆ విషయం తెలుసుకున్నారు పంచుమర్తి అనురాధ. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కబనరుస్తూ తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం కార్యాలయానికి పంపారు. కానీ.. అప్పుడు ఆమెకు పిలుపు రాలేదు. 2000 సంవత్సరంలో.. విజయవాడ నగరపాలక సంస్థకు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. మేయర్‌ పదవి బీసీ మహిళలకు రిజర్వు అయ్యింది.

అప్పుడు.. తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నుంచి అనురాధకు పిలుపు వచ్చింది. మొత్తం 18 మంది మహిళలు తెలుగుదేశం నుంచి పోటీకి.. దరఖాస్తు చేసుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబే స్వయంగా అభ్యర్థుల్ని.. ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీపై ఆసక్తి ప్రదర్శించే చంద్రబాబుకు.. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు ఆకర్షించాయి.

ఆ తర్వాత రెండ్రోజులకు విజయవాడ మేయరు అభ్యర్థిగా.. అనురాధను ప్రకటించారు. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు కమ్యూనిస్టులు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినా .. ఆ ఎన్నికల్లో 6 వేల 800 ఓట్ల ఆధిక్యంతో పంచుమర్తి అనురాధ గెలిచారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 26ఏళ్లే.! పిన్నవయసులో మేయరైన అనురాధ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించారు.

అరంగేట్రంతోనే మేయర్‌ పగ్గాలు అందుకున్న అనురాధను.. అప్పట్లో జీవోల మేయర్‌గా పిలిచేవారు. విజయవాడ కౌన్సిల్‌లో తెలుగుదేశం సంఖ్యా బలం తక్కువ కావడంతో.. పాలకవర్గ సమావేశంలో మేయరు ప్రతిపాదనలు చెల్లేవి కావు. అప్పుడామె సీఎంగా ఉన్న చంద్రబాబుపై ఆధారపడి.. విజయవాడలో పలు అభివృద్ధి పథకాలకు నిధులు తెచ్చారు. అన్నింటికీ ప్రభుత్వం నుంచే నేరుగా జీవోలు వచ్చేవి. అలా ఆమె మేయర్‌గా ఉండగా దాదాపు 17 జీవోలు వచ్చాయి. అలా.. ఆమెను జీవోల మేయరని పిలిచేవారు.

చిన్నవయస్సులోనే రాజకీయ ప్రవేశం చేసిన అనురాధకు.. మొదట్లో అంతా అయోమయంగా ఉండేది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో రాజకీయ శాస్త్ర అధ్యాపకులు పార్థసారధి దగ్గర.. ట్యూషన్‌కు వెళ్లి.. చట్టాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు.

అనురాధ తండ్రి పుల్లారావు ఐఆర్‌ఎస్‌ అధికారి. వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. హైదరాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో ఆమె ప్రాథమిక విద్యభ్యాసం చేశారు. తండ్రి ఉద్యోగ బదీలీతోపాటు.. ఆమె హైస్కూల్‌, ఇంటర్‌ విద్య కూడా విజయవాడకు షిఫ్ట్‌ అయింది. గుంటూరు జేకేసీ కళాశాలలో.. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే.. పారిశ్రామికవేత్త శ్రీధర్‌తో ఆమెకు వివాహమైంది. ఆ తర్వాత కూడా అనురాథ చదువును కొనసాగించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి.. జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

తెలుగుదేశం పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. గతంలోనే.. ఎమ్మెల్సీ పదవికి ఆమె పేరును చంద్రబాబు గతంలోనే ప్రతిపాదించినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని రెండు సంవత్సరాలే పదవీకాలం ఉండేలా.. నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీన్ని పంచుమర్తి అనురాధకు కేటాయించగా తాను పూర్తి కాలం పనిచేయాలనేదే లక్ష్యమంటూ ఆమె తిరస్కరించారు.

తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పదవి లభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఇప్పటిదాకా.. ఆమెపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. అనురాధ అనూహ్య విజయాలతో పాటు అనారోగ్య సమస్యను జయించి.. ధైర్యశాలిగా నిలిచారు. క్యాన్సర్‌ను జయించారు. గత 15 ఏళ్లుగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. తీర ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గానికి సేవలందిస్తున్నారు.

పోరాట స్ఫూర్తికి ఆమె ఓ నిదర్శనం.. పంచుమర్తి అనురాధ ప్రస్థానం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details