తహసీల్దారు నుంచి కలెక్టర్ వరకు ప్రతి అధికారికి తన భూ సమస్యను విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఇక్కుర్తి ఆంజనేయులు(41)కు పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామంలో కట్నంగా 1.61 ఎకరాల భూమి వచ్చింది. దాన్ని అమ్మకానికి పెట్టి కొంత నగదు అడ్వాన్సు పొందారు. ఈ భూమి వివరాలు దస్తావేజుల్లో రెండు సబ్ డివిజన్లలో ఉంటే పాస్ పుస్తకాల్లో మూడు సబ్ డివిజన్లలో చూపుతున్నాయంటూ కొనుగోలుదారు అభ్యంతరం తెలిపారు. దస్తావేజులో, అడంగల్‌లో ఒకేరకంగా ఉంటేనే కొంటామని చెప్పారు. దీంతో ఆంజనేయులు అడంగల్‌లో సరిచేయించుకోవటానికి పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో గతేడాది జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగూ భూమి అమ్ముతున్నాం కదా అని అడ్వాన్స్‌గా వచ్చిన డబ్బుతో జొన్నలగడ్డలో సొంతింటి నిర్మాణం మెదలుపెట్టారు. కాని రెవెన్యూ అధికారులు సమస్యను సాగదీయడంతో ఈనెల 7న గుంటూరు కలెక్టరేట్‌లోకి ఆంజనేయులు పురుగుల మందుడబ్బాతో వచ్చాడు. అధికారుల తీరును నిరసిస్తూ ఆత్మహత్యకు యత్నించారు. కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి స్వయంగా వచ్చి వారించారు. సమస్య తెలుసుకోవాలని కలెక్టరేట్ ఏవో మోహనరావును ఆదేశించారు. అదేరోజు ఆంజనేయులు నుంచి అధికారులు వివరాలు తీసుకున్నారు. పది రోజులు గడిచినా, కొలిక్కి రాకపోవడంతో ఆదివారం రాత్రి 11 గంటలకు ఇంటి పైభాగంలోకి వెళ్లిన ఆంజనేయులు, కిందకు దూకారని కుటుంబీకులు తెలిపారు. వెంటనే జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు.
అధికారుల అలసత్వానికి... అన్నదాత బలి
రెవెన్యూ అధికారుల అలసత్వానికి అన్నదాత బలైయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో జరిగింది. తహసీల్దారు నుంచి కలెక్టర్ వరకు ప్రతి అధికారికి తన భూ సమస్యను విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు ఓ రైతు ఆత్మహత్యే శరణ్యమైంది.
మృతదేహంతో ఆందోళన
ఆంజనేయులు మృతదేహంతో కుటుంబీకులు, గ్రామస్థులు రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ జీజీహెచ్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పి పంపించగా, ఆస్పత్రి మార్చురీ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. చివరకు పోస్టుమార్టం తర్వాత శవాన్ని అప్పగించగా స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతుడి కుమారులు వెంకటసాయి, చరణ్ మాట్లాడుతూ ‘మానాన్న ఆత్మహత్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణం. సకాలంలో అడంగల్‌లో వివరాలు సరిచేస్తే ఇంతదాకా వచ్చేది కాదు. చాలాసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుకొని పెద్దఎత్తున లంచాలు తీసుకున్నారు. లంచాలపై స్పందనలో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ కల్పించుకున్నా, సిబ్బంది పట్టించుకోలేదు. అధికారులను కఠినంగా శిక్షించాలి’ అని కోరారు. అడంగల్‌లో మార్పులతో పాటు ఆంజనేయులు కుటుంబానికి పరిహారం ఇవ్వాలని మృతుడి సోదరుడు యుగంధర్ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒక రైతు సమస్య పరిష్కరించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. కాగా, అడంగల్‌లో వివరాల నమోదుకు కొంత కసరత్తు జరిగిందని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. అదనపు సమాచారం కోసం ఆంజనేయులును కార్యాలయానికి పిలిచినా రాలేదని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వివరాలు సరిచేసి జేసీ లాగిన్‌కు పంపామని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అధికారులు వాపోయారు.
ఇదీ చదవండి:PAWAN KALYAN: 'రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలెందుకు?'