ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుపాను ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్ - ఆ రెండు జిల్లాల్లో పర్యటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 9:25 PM IST

CM YS Jagan Cyclone Affected Areas Visit: సీఎం వైఎస్ జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాలలో శుక్రవారం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా చేరుకుని నష్టపోయిన ప్రాంతాలను పర్యటించి, బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం బాపట్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడనున్నారు.

CM_YS_Jagan_Cyclone_Affected_Areas_Visit
CM_YS_Jagan_Cyclone_Affected_Areas_Visit

CM YS Jagan Cyclone Affected Areas Visit: తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను (Cyclone Michaung) ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం చేరుకుంటారు. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్థులు, తుపాను బాధితులతో నేరుగా సీఎం సమావేశమవుతారు.

ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి చేరుకుంటారు.

నట్టేట ముంచిన తుపాను - తీవ్రంగా దెబ్బతిన్న పంటను చూసి రైతుల కన్నీరు

CS Jawahar Reddy Review on Cyclone Michaung Relief: రాష్ట్రంలో మిగ్‌జాం తుపాను వల్ల కలిగిన పంట నష్టం అంచనాలను త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్‌ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను అనంతర సహాయ పునరుద్ధరణ చర్యలపై సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లుతో వీడియో సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టాల అంచనా తదితర అంశాలపై సమీక్షించారు.

నిబంధనల సడలింపునకు కేంద్రానికి లేఖ: తుపాను నష్టం పరిశీలనకు రాష్ట్రానికి బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపుతున్నట్లు చెప్పారు. ఈలోగా తుపాను సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం లక్షా 45 వేల 795 హెక్టార్లలో వరి, 31 వేల 498 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. నష్టం వివరాల నమోదు పూర్తి కాగానే పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్​పుట్ సబ్సిడీని అందించడంతో పాటు నూరు శాతం బీమా సౌకర్యం వర్తింపజేస్తామన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం సేకరణకు నిబంధనల సడలింపునకు కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

నిండా ముంచిన మిగ్‌జాం తుపాను - ఆందోళనలో రైతులు

నూరు శాతం బీమా కల్పించేందుకు చర్యలు:తుపాను వల్ల 92 వేల 577 హెక్టార్లలో వరి నీట మునగగా, 53 వేల 218 హెక్టార్లలో వరి నేలకొరిగిందని మొత్తం 1 లక్షా 45 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఈనెల 11 నుంచి పంట నష్టం అంచనా ప్రక్రియను ప్రారంభించనున్నట్టు చెప్పారు. 31 వేల 498 హెక్టార్లలో అరటి, బొప్పాయి తదితర ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. దెబ్బతిన్న పంటలన్నిటికీ నూరు శాతం బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

పశు సంపద, బోట్లు, వలలు నష్టపోయిన బాధితులకు శుక్రవారం సాయంత్రానికి ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేసి నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 55 రహదారులకు సంబంధించి 93.8 కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి రావాలి - బాధితులకు ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటాం : సీఎం జగన్

TAGGED:

ABOUT THE AUTHOR

...view details