ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలుగు 'జేమ్స్​బాండ్'​కి.. రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

By

Published : Nov 15, 2022, 3:52 PM IST

Leaders Condolence to Superstar Death : సూపర్ స్టార్ కృష్ణ మృతితో.. నటీనటులు, ప్రముఖులు, అభిమానులు శోకతప్త సంద్రంలో మునిగిపోయారు. కృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి.. కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసిందని విచారం వ్యక్తం చేశారు.

Leaders Condolence to Superstar Death
Leaders Condolence to Superstar Death

SUPERSTAR KRISHNA : సూపర్​స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. తెలుగు సినిమా రంగానికి కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం పదిలం చేసుకున్న కృష్ణ మరణం... అత్యంత విచారకమని.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని గుర్తుచేసుకున్నారు. తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరమని.. వెంకయ్య కొనియాడారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన ఆయన.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నిజ జీవితంలోనూ మనసున్న మనిషి: కృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. సినిరంగంలో ప్రత్యేకతతో పాటు నిజజీవితంలోనూ కృష్ణను మనసున్న మనిషిగా జగన్ అభివర్ణించారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటని సీఎం ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణ చేసిన కృషిని ప్రస్తావించారు. కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసినట్లందని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణ తుదిశ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించిందని నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి ఆయన సార్థకత చేకూర్చారని పేర్కొన్నారు.

వాటన్నింటిని కలబోతే కృష్ణ: సూపర్ స్టార్ కృష్ణ మరణం మాటలకు అందని విషాదంగా చిరంజీవి పేర్కొన్నారు. కృష్ణ అందర్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదన్న చిరు... ఆయన మంచి మనసుగలిగిన హిమాలయ పర్వతంలాంటి వారని పేర్కొన్నారు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ అని మెగాస్టార్ అభివర్ణించారు. కళామతల్లి ముద్దుబిడ్డ ఘట్టమనేని కృష్ణ అని నటుడు బాలకృష్ణ అన్నారు. నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు కృష్ణ అని కొనియాడారు. కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కు కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

ఆయన సేవలు తెలుగు పరిశ్రమకు చిరస్మరణీయం: సూపర్​స్టార్ కృష్ణ అంటే సాహసానికి మరోపేరు అని.. ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్​ అన్నారు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూపిన నటుడు అంటూ కొనియాడారు. తెలుగు తెరకు ఆధునిక సాంకేతికతలను పరిచయం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ మృతితో తెలుగు పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని నటుడు రవితేజ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కృష్ణతో చాలా అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి.. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని నటుడు రజనీకాంత్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలు తన జీవితంలో మరవలేనివని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details