CBN Amaravati Inner Ring Road Case in High Court: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను బుధవారానికి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా.. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేయగా.. దానిని న్యాయస్థానం కొట్టి వేసింది. అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే రోడ్డుల ఎలైన్‌మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ గత ఏడాది మే 9న పలువురిపై కేసు నమోదు చేసింది.
ఇందులో చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. దీంతో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించింది.