ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామీణులకు డిజిటల్ వైద్య సేవలు.. ముందుకొచ్చిన 3 ఫౌండేషన్లు

By

Published : Aug 18, 2020, 2:51 PM IST

three trusts providing digital medication to rural people
three trusts providing digital medication to rural people

గ్రామాల్లో అత్యున్నత ప్రమాణాలతో డిజిటల్ వైద్య సేవలు అందించేందుకు.. 3 స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. టెలీమెడిసిన్ తో పాటు, దివ్యాంగుల సంక్షేమం, మహిళా సాధికారత కోసం కృషి చేయనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తేతలి నారాయణరెడ్డి - తేతలి అచ్చియమ్మ ట్రస్ట్, మధునాపంతుల ఫౌండేషన్, దిల్లీకి చెందిన సంగతి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సేవలు తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించాయి.

డాక్టర్ దశరథరామిరెడ్డి

గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యుత్తమమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. డిజిటల్ సేవలను పెంచడమే లక్ష్యంగా 3 ఫౌండేషన్లు సంయుక్తంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగం అధిపతిగా ఉన్న డాక్టర్ దశరథరామిరెడ్డి.. తన తల్లిదండ్రుల పేరుతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాటు చేసిన తేతలి నారాయణరెడ్డి, అచ్చియమ్మ చారిటబుల్ ట్రస్ట్, ఇదే జిల్లాలోని పల్లిపాలెనికి చెందిన మధునాపంతుల ఫౌండేషన్, భారతి ఎయిర్ టెల్​లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అల్కా అస్థానా నేతృత్వంలో ఏర్పాటైన సంగతి ఫౌండేషన్ ( దిల్లీ)లు సంయుక్తంగా ఈ సేవలు ప్రారంభించాయి.

ఆగస్టు 15 స్వాతంత్రం దినోత్సవం రోజున డాక్టర్ దశరథరామిరెడ్డి, మధునాపంతుల ట్రస్ట్ తరపున మధునాపంతుల కిరణ్, సంగతి ఫౌండేషన్ తరపున అల్కా అస్థానా ఆన్​లైన్ ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవాన ప్రధాని మోదీ సందేశంలోని ప్రధానాంశాలైన.. డిజిటల్ హెల్త్, ఆన్ లైన్ ఎడ్యుకేషన్, మహిళా సంక్షేమం,గ్రామాలకు ఫైబర్ కనెక్టివిటీ అనే అంశాలపై తమ ఫౌండేషన్లు దృష్టి సారిస్తాయని వారు తెలిపారు. డాక్టర్ దశరథరామిరెడ్డి ఆన్​లైన్ ద్వారా పల్లిపాలేనికి చెందిన రోగులను పరీక్షించి సూచనలు అందజేశారు.

త్వరలో యాప్

తమ సేవలను విస్తృతం చేసేందుకు త్వరలో ప్రత్యేక యాప్ ను తీసుకురానున్నట్లు డాక్టర్ దశరథరామిరెడ్డి తెలిపారు. తాను ట్రస్ట్ ద్వారా ఇంతకు ముందు కూడా గ్రామాల్లో వైద్యసేవలు అందించానని.. కరోనా కారణంగా ఇప్పుడు అక్కడకు వెళ్లే పరిస్థితులు లేవన్నారు. ఈ తరుణంలో డిజిటల్ వైద్య సేవలు మంచి పరిష్కారమని అన్నారు. గ్రామాల్లో ఉన్న వారికి అత్యుత్తమ కార్పోరేట్ వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

ABOUT THE AUTHOR

...view details