Endowment Department Lands: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలెంలో ఆలయ భూములు పరిశీలించిన దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు వారం పదిరోజుల్లో వేలం నిర్వహించి కౌలుదారులకు.. అందజేస్తామని ఆయన అన్నారు. ఈ మాటలు చెప్పి ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా భూముల వేలంపాట మాత్రం నిర్వహించలేదు.
వేలం నిర్వహిస్తే సాగు చేసుకుంటాము : దేవదాయశాఖకు చెందిన సుమారు 67 ఎకరాల భూమిని కొందరు పెద్దలు తమ గుప్పిట పెట్టుకుని.. రాజకీయ పలుకుబడితో వేలం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని.. పేదలు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు వేలం నిర్వహిస్తే తాము పాట పాడుకుని సాగు చేసుకుంటామని చెప్తున్నారు.
దశాబ్దాలుగా వేలం లేదు : రంపయర్రంపాలేనికి చెందిన శ్రీమల్లంపల్లి సుందరమ్మ.. 1953లో 89.14 ఎకరాల మెట్ట భూమిని పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలోని శ్రీఉమా మహేశ్వరస్వామి.. ఆలయానికి దానంగా ఇచ్చారు. స్వామివారి కళ్యాణం, కార్తీక మాసంలో పూజలు, బాటసారుల దాహార్తి, అన్న సంతర్పణకు ఈ భూమి వినియోగించాల్సిందిగా ఆమె కోరారు. ఈ భూమిలో 17.14 ఎకరాలు కొండ ప్రాంతం ఉండగా.. సూరంపాలెం రిజర్వాయర్ కాల్వలకు 4.35 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మిగిలిన 67.65 ఎకరాలను 17 భాగాలుగా విభజించి.. కొందరు కొన్నేళ్లుగామామిడి, జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. దేవదాయ భూములకు ప్రతి మూడేళ్లకు ఒకసారి వేలం నిర్వహించాల్సి ఉన్నా.. కొన్ని దశాబ్దాలుగా వేలం నిర్వహించడం లేదు. అనధికారికంగానే కొందరు రైతులు సాగుచేసుకుంటున్నారు. సత్రం భూములకు తక్షణమే బహిరంగ వేలం నిర్వహిస్తే.. దేవదాయశాఖకు ఆదాయం, ఊళ్లో కూలీలకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెప్తున్నారు.