తూర్పుగోదావరి జిల్లాలోని 26 మండలాల పరిధిలో 168 గ్రామాలు వరద బారినపడ్డాయి. 82 గ్రామాల్లోకి నీరు చేరింది. 21 వేల 192 గృహాల్లోకి వరదనీరు చేరింది. వ్యవసాయ పంటలు 1614.30 హెక్టార్లలో, ఉద్యాన పంటలు 7227 హెక్టార్లలో నీట మునిగాయి. వరద నీటిలో పడి ఒకరు మృతిచెందగా, ఇంకొకరు గల్లంతయ్యారు. 50 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విలీన మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మన్యంలోని దేవీపట్నం మండలంలో స్వల్పంగా వరద నీరు తగ్గింది. కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా... మరికొన్ని కూలిపోతున్నాయి. వరద తగ్గిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆరు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచింది. కొండలపై ఉన్న గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ములకల్లంక గ్రామం వరద గుప్పిట్లోనే ఉంది.
కోనసీమలో 51 లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా గ్రామాల్లోనే ఉన్నవారంతా నిత్యావసరాలకు అవస్థలు పడుతున్నారు. బడుగువాని లంకలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పర్యటించారు. వరద బాధితులకు బియ్యం, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. బాధితులకు అన్నివిధాలు అండగా ఉంటామన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని అమలాపురం ఎంపీ చింతా అనురాధ అన్నారు. లంక గ్రామాల్లో పర్యటించిన ఆమె...బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. సఖినేటిపల్లి మండలం వరద ప్రాంతాలలో తెదేపా నేత గొల్లపల్లి సూర్యారావు పర్యటించి...బాధితులను పరామర్శించారు.