ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu Letter: అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ

By

Published : Apr 27, 2023, 7:48 PM IST

Chandrababu Letter to DGP: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ.. చట్టాన్ని ధిక్కరించి పక్షపాత ధోరణితో పని చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. కుప్పం నియోజవకర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారని డీజీపీకి లేఖ రాశారు.

Chandrababu Letter to DGP
Chandrababu Letter to DGP

Chandrababu Letter to DGP: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు నిరంతర వేధింపులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారని.. ప్రాథమిక ఉల్లంఘనలకు పాల్పడిన వైఎస్సార్‌సీపీ నేతలపై చర్యలు లేవని ఆగ్రహించారు. పోలీసు వ్యవస్థ.. చట్టాన్ని ధిక్కరించి పక్షపాత ధోరణితో పని చేస్తోందని ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. కుప్పం నియోజవకర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారని డీజీపీ రాజేంద్రనాథ్​ రెడ్డికి లేఖ రాశారు.

వైసీపీ నేతల ఆదేశాలతో 34 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో రౌడీ షీట్లు ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని లేఖలో ప్రస్తావించారు. పోలీసులు వైసీపీ నాయకుల పట్ల ఒకలా.. టీడీపీ నాయకుల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసు, రెవెన్యూ అధికారులు కలిసి టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై కృష్ణయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో పోలీసులు 'రూల్‌ ఆఫ్‌ లా'ను పూర్తిగా విస్మరించి వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా దారుణమన్నారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, అధికార వైఎస్సార్సీపీ నేతలతో కుమ్మక్కయ్యిందనడానికి నిదర్శనంగా కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ కేస్ స్టడీ నిలుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అసమ్మతి తెలిపినా, వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు మేరకు పోలీసులు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) క్యాడర్‌పై కేసులు బనాయించి, వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టేందుకు స్వేచ్ఛనిస్తున్నారని ధ్వజమెత్తారు.

2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది 2023లో మొదటి మూడు నెలల్లోనే నమోదైన కేసులు చూస్తుంటే కుప్పంలో పోలీసులు పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. కుప్పంలోని టీడీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా రౌడీషీట్‌ దాఖలు పేరుతో బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ క్యాడర్‌పై రౌడీషీట్‌లు తెరవడం కోసమే పోలీసులు తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ క్యాడర్‌పై రౌడీషీట్‌లు తెరిచినందుకు ప్రతిఫలంగా అధికార వైఎస్సార్‌సీపీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారన్నారు. 2023 ఏప్రిల్ 10వ తేదీన కుప్పం అసెంబ్లీ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 34 మంది టీడీపీ నాయకులపై రౌడీషీట్ తెరవాలని పలమనేరు డీఎస్పీకి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే అన్నారు.

టీడీపీ క్యాడర్‌పై రౌడీషీట్‌ను తెరవాలన్న 34 ప్రతిపాదనల వెనుక ఉన్న ఉద్దేశాలు, కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. కుప్పంలో పోలీసుల పనితీరు బ్రిటీష్‌ పాలనను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యల వల్ల ప్రజాస్వామ్యాన్ని అణచివేయడమే కాకుండా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. టీడీపీ క్యాడర్‌పై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కుప్పం అసెంబ్లీ పరిధిలో పని చేస్తున్న పోలీసులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన లేఖలో విన్నవించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని, మొత్తం పోలీసు శాఖకు అవమానం కలిగించే అటువంటి అధికారులను కఠినంగా శిక్షించేలా చూడాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details