ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బల్క్‌ డ్రగ్‌ పార్కు అయోమయం: రాతల్లో ఆంధ్రప్రదేశ్​.. మాటల్లో తెలంగాణ

By

Published : Dec 17, 2022, 3:34 PM IST

CONFUSION OVER CANTRAL DECISION: లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇచ్చిన ఓ సమాధానం అయోమయాన్ని సృష్టించింది. బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటు గురించి తెలుగు రాష్ట్రాల ఎంపీలు వెంకటేష్‌ నేత, ఎంవీవీ సత్యనారాయణ, నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఆయన వేర్వేరు సమాధానాలు ఇచ్చారు. రాతపూర్వక సమాధానంలో ఆయన బల్క్‌ డ్రగ్స్‌ పార్కును ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినట్లు తెలపగా.. మౌఖికంగా మాత్రం దాన్ని తెలంగాణకు కేటాయించినట్లు తెలిపారు.

CONFUSION OVER CANTRAL DECISION
CONFUSION OVER CANTRAL DECISION

CONFUSION OVER CANTRAL DECISION : లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం రాతపూర్వకంగా, మౌఖికంగా ఇచ్చిన సమాధానం అయోమయాన్ని సృష్టించింది. బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటు గురించి తెలుగు రాష్ట్రాల ఎంపీలు వెంకటేష్‌నేత, ఎంవీవీ సత్యనారాయణ, నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నుంచి వేర్వేరు సమాధానాలు వచ్చాయి. రాతపూర్వక సమాధానంలో ఆయన బల్క్‌ డ్రగ్స్‌ పార్కుని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినట్లు తెలపగా, మౌఖికంగా మాత్రం దాన్ని తెలంగాణకు కేటాయించినట్లు పేర్కొన్నారు.

శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో 144వ ప్రశ్న కింద పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌నేత, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్న వచ్చింది. స్పీకర్‌ ఓంబిర్లా పిలిచినప్పుడు వారిద్దరూ సభలో లేకపోవడంతో అనుబంధ ప్రశ్న వేయడానికి నామా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ‘‘దేశం చైనా నుంచి భారీగా బల్క్‌ డ్రగ్స్‌ దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులను అరికట్టడానికి దేశంలో వాటి తయారీ పార్కులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల రాష్ట్రంలో పార్కు ఏర్పాటు కోసం సకాలంలో తెలంగాణ దరఖాస్తు చేసుకొంది. ఫార్మా రంగంలో హైదరాబాద్‌ చాలా ముఖ్యపాత్ర పోషిస్తోంది. కరోనా సమయంలోనూ గరిష్ఠ స్థాయిలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసింది. అన్ని సౌకర్యాలూ ఉన్న తెలంగాణకు ఆ పార్కును ఇస్తున్నారా? లేదా’’ అని ప్రశ్నించారు.

అందుకు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందిస్తూ... ‘‘దేశంలో మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కులు ఏర్పాటు చేయాలని, ఒక్కోదానిపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. ఇందుకు కొన్ని కొలమానాలు పెట్టి రాష్ట్రాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాం. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల నుంచి రాగా వాటిని పరిశీలించాం. హైదరాబాద్‌ ఫార్మా పరిశ్రమకు ముఖ్యమైన ప్రాంతమని సభ్యుడు చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పార్కు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు రూ.వెయ్యి కోట్లు లభిస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ల్లోనూ ఈ పార్కు ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. ఇప్పటికే వాటికి ప్రాథమికంగా రూ.300 కోట్ల చొప్పున ఇచ్చాం’’ అని చెప్పారు.

అయితే సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆమోదించినట్లు వెల్లడించారు. దీనిపై వివరణ కోరడానికి నామా నాగేశ్వరరావు ప్రయత్నించగా స్పీకర్‌ ఓంబిర్లా తదుపరి ప్రశ్నకు వెళ్లడంతో ఈ పార్కు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారా? లేదంటే తెలంగాణకా? అన్న అంశంపై స్పష్టత రాలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details