ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పీపీఏలు రద్దు చేస్తే నగదు ప్రవాహం నిలిచిపోతుంది.. రేటింగ్స్ సంస్థ హెచ్చరిక!

By

Published : Jul 17, 2019, 10:16 PM IST

Updated : Jul 18, 2019, 2:08 PM IST

విద్యుత్ కోనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం... విద్యుత్ ఉత్పత్తి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ హెచ్చరించింది. పీపీఏలను సమీక్షించినా, రద్దు చేసినా ఉత్పత్తి సంస్థలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చని అంచనా వేసింది.

పీపీఏ లను రద్దు చేస్తే నగదు ప్రవాహం నిలిచిపోతుంది.. రేటింగ్స్ సంస్థ హెచ్చరిక..

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ హెచ్చరించింది. సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తిరిగి చర్చలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఉత్పత్తి సంస్థల నగదు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయని తెలిపింది.

ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వం నుండి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఎలను విజయవంతంగానే పునస్సమీక్షించినప్పటికీ... విద్యుత్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఫిచ్ తెలిపింది. ఈ చర్యలతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలురుణాలు సేకరణ కోసం జారీ చేసే బాండ్ల విలువ తగ్గిపోతుందని చెబుతోంది.

సౌర, పవన విద్యుత్ రంలో అధిక ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం చెబుతోంది. ఈ పీపీఏలను పునఃసమీక్షిస్తామని ప్రకటించడంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి ఆందోళన వ్యక్తమైంది. సౌర పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సమీక్షించాలని ఓ ఉన్నత స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ పరిణామాలు మంచిది కాదని..పీపీఏలను సమీక్షిస్తే వ్యాపార అనుకూల వాతావరణం దెబ్బతింటుందని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాన్ని వారించింది. అయినప్పటికీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్ష విషయంలో ముందుకే వెళ్లాలనుకుంటున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందని ఫిచ్ పేర్కొంది.

పీపీఏల సమీక్షించడానికి రాష్ట్రప్రభుత్వం రెగ్యులేటరీ కమిషన్ అనుమతి పొందాలని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ చెబుతోంది. పీపీఏలను సమీక్షించినా లేక రద్దు చేసినా.. పునరుత్పాదక విద్యుత్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పకపోవచ్చని ఈ రేటింగ్ సంస్థ అంచనావేస్తోంది.

కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాలు సౌర పవన విద్యుత్ సంస్థల పీపీఏలను సమీక్షించడానికి ప్రయత్నించినప్పటికీ. కేంద్రం మాత్రం ఆ సంస్థలకే అండగా నిలిచింది.

Last Updated : Jul 18, 2019, 2:08 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details