రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటం, కావాల్సిన బ్రాండ్లు దొరక్క పోవడంతో తెలంగాణ మద్యానికి డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమార్కులు తెలంగాణ మద్యాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి యధేచ్చగా విక్రయిస్తున్నారు. అధికారులు తనిఖీ చేస్తున్నా... అక్రమార్కులు రోజూ ఏదో ఒక చోట అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.
గుంటూరు జిల్లాలో తవుడు బస్తాల మధ్య మద్యం తరలిస్తుండగా రేవేంద్రపాడు వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని... 70 కేసుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట నుంచి మద్యం తీసుకువస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. పట్టుబడిన సరుకు విలువ 5 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని... ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.