ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Illegal mining: కొండలను..కొల్లగొడుతున్నారు !

By

Published : Nov 3, 2021, 11:20 AM IST

కొండల్ని పిండి చేస్తున్నారు.. పరిమితికి పదిరెట్లు మించి ఖనిజాన్ని తరలిస్తున్నారు. అధికారం అండతో సరిహద్దులు దాటి అవతలి వారి క్వారీల్లోనూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ సొమ్ము పక్కదారి పడుతున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా సాగుతున్న మైనింగ్ మాఫియా ఆగడాలపై ప్రత్యేక కథనం.

illegal mining
illegal mining

నేమకల్లు కంకర క్వారీల్లో అక్రమాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని నేమకల్లు కంకర క్వారీల్లో అక్రమాలు హద్దులు దాటుతున్నాయి. అధికార పార్టీ నేతకు చెందిన కుటుంబ సభ్యుల పేరిట లీజు పొంది పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం. ప్రభుత్వానికి రాయల్టీ సైతం చెల్లించకుండా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వెయింగ్ మిషన్లు సైతం అధికారులు తనిఖీకి వచ్చే సమయాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. రోజుకు లక్షల్లో ఆర్జిస్తూ ప్రభుత్వానికి మాత్రం నామమాత్రపు రుసుం రాయల్టీగా చెల్లిస్తున్నారు.

నేమకల్లు పరిధిలో గతంలో 21 కంకర క్వారీలు, క్రషింగ్ మిషన్లు ఉండేవి. స్థానిక ప్రజాప్రతినిధికి సైతం 20 హెక్టార్లలో క్వారీ లీజు, క్రషర్ మెషిన్ ఉంది. క్వారీల్లో పేలుళ్లు, దుమ్ము కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని 2018లో రైతులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. విచారణ జరిపి క్వారీల అనుమతులు రద్దు చేసింది. రెండేళ్లకు పైగా ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోగా.. 2021లో సదరు నేత తన పలుకుబడి ఉపయోగించి.. మళ్లీ అనుమతులు తెచ్చుకున్నారు. కుటుంబ సభ్యులు, ఉద్యోగుల పేరిట 4 క్వారీలకు అనుమతులు తీసుకుని ఖనిజాన్ని తవ్వితీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరిహద్దులు దాటి తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

'నేమకల్లు గ్రామంలో మాకు క్వారీలున్నాయ్​. మా క్వారీ కేసులో ఉంది. మేము దాన్ని ఖాళీగా ఉంచేశాం. దానిలో ఉప్పుడు ఎమ్మెల్యే అక్రమంగా మైనింగ్​ చేస్తున్నాడు. పక్క ఫ్యాక్టరీ, పక్క మెషిన్​ వాళ్లకీ ఇస్తున్నాడు. మేము ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు' - అప్పారావు, బాధిత లీజుదారు

క్వారీలో పేలుళ్లతో ఇళ్లు దెబ్బతింటున్నాయని.. దుమ్ము, ధూళి కారణంగా పంటలు పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పేలుళ్లతో గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆంజనేయస్వామి ఆలయంలో మూలవిరాట్టు కొంతమేర దెబ్బతిన్నదన్నారు. క్రషర్లు, క్వారీలను ఆనుకుని 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా పరిహారం చెల్లించలేదు. దీంతోపాటు క్వారీల్లో పేలుళ్ల కారణంగా భూపొరల్లో కదలిక వచ్చి బోరుబావులు దెబ్బతింటున్నాయని అధికారులు తేల్చారు. కానీ.. స్థానిక ప్రజాప్రతినిధికి భయపడి క్వారీ లీజుదారులపై, అనుమతి లేని క్రషర్లపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

Mahapadayathra: మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

ABOUT THE AUTHOR

...view details