ఆంధ్రప్రదేశ్

andhra pradesh

GANGAVARAM PORT: గంగవరం పోర్టు వాటా విక్రయాలపై తెదేపా నిరసనలు

By

Published : Aug 27, 2021, 9:22 AM IST

Updated : Aug 27, 2021, 11:36 AM IST

గాజువాకలో గంగవరం పోర్ట్​లోని వాటాలను రాష్ట్ర ప్రభుత్వ అదానీ గ్రూప్​కి అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నిరసనకు దిగింది. పోర్టులోని ప్రభుత్వ వాటాను ఇప్పటికిప్పుడు అమ్మాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

TDP PROTEST
TDP PROTEST

విశాఖ జిల్లా గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు.. పాతగాజువాక కూడలిలో ఆందోళన చేపట్టారు. పోర్టులోని ప్రభుత్వ వాటాను ఇప్పటికిప్పుడు అమ్మేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. పోర్టును అదానీకి కట్టబెట్టడం ద్వారా.. స్టీల్‌ ప్లాంటును కూడా ప్రైవేటుపరం చేయడానికి ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ వాటా ప్రైవేటుపరం...

గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4శాతం వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ సొంతమవుతోంది. ఈ వాటాను రూ. 644.78 కోట్లకు తమకు విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న అనుమతి ఇచ్చినట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ వెల్లడించింది. ఈ లావాదేవీ ఒక నెలలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌ లో ఆ సంస్థ ప్రమోటర్‌ నుంచి 58.1 శాతం వాటాను కొంతకాలం క్రితం అదానీ గ్రూపు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే ఈ కంపెనీలో 31.5 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 10.4 శాతం వాటా కూడా దక్కడంతో ..గంగవరం పోర్ట్‌ లో వందశాతం వాటా అదానీ చేతికి వచ్చినట్లు అవుతుంది.

విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్‌ గత దశాబ్దకాలంలో దేశానికి తూర్పుతీరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన పోర్టుల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 32.81 మిలియన్‌ టన్నుల సరకు రవాణా నమోదు చేసింది. తద్వారా రూ.1,057 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏటా 64 మిలియన్‌ టన్నుల కార్గో ను రవాణా చేయగల సామర్థ్యం ఈ పోర్టుకు ఉంది.

ఇదీ చదవండి: కాబుల్​ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు- 72 మంది మృతి

Last Updated : Aug 27, 2021, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details