ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో 10 వేల ఆక్రమణలు!

By

Published : Nov 8, 2020, 8:27 AM IST

విశాఖను పరిపాలన రాజధాని చేస్తున్నారనే ప్రకటనతో నగరంలో కబ్జాలు పెరిగాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమనిర్మాణాలతో పాటు అనుమతుల్లేకుండా ఇళ్లు నిర్మించుకోవడం, తీసుకున్న అనుమతికి మించి స్థలాల్లో నిర్మాణాలు విస్తరించడం, ఇదివరకే ఉన్న భవనంపై అనుమతి లేకుండా అంతస్తులు పెంచుకోవడం లాంటివి గుర్తించారు. ఇప్పటి వరకు 4,100కు పైగా తాజా ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయని జీవీఎంసీ సర్వేలో వెల్లడైంది.

Illegal constructions are rampant in the city of Visakhapatnam.
విశాఖలో జోరుగా భూ ఆక్రమణలు

విశాఖ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పరిపాలన రాజధాని ప్రకటన తర్వాత వీటి సంఖ్య భారీగా పెరిగింది. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నెలా పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న సర్వేలో ఇలాంటి అక్రమ కట్టడాలు ఎన్నో బయటపడ్డాయి. నగరవ్యాప్తంగా 10 వేలకు పైగా అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. మరింత స్పష్టత కోసం లోతుగా సర్వే చేస్తున్నారు. జీవీఎంసీలోని తాజా, పాత రికార్డుల ఆధారంగా వార్డు సచివాలయాల వారీగా సర్వే కొనసాగిస్తున్నారు. ప్రతి ఆక్రమణకు సంబంధించి ఫొటోతో పాటు అక్షాంశాలు, రేఖాంశాల్ని సైతం ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తున్నారనే ప్రకటనతో నగరంలో కబ్జాలు పెరిగాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమనిర్మాణాలతో పాటు అనుమతుల్లేకుండా ఇళ్లు నిర్మించుకోవడం, తీసుకున్న అనుమతికి మించి స్థలాల్లో నిర్మాణాలు విస్తరించడం, ఇదివరకే ఉన్న భవనంపై అనుమతి లేకుండా అంతస్తులు పెంచుకోవడం లాంటివి గుర్తించారు. ఇప్పటి వరకు 4,100కు పైగా తాజా ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ 4 నెలలుగా నిర్మాణంలో ఉన్నట్లు తేల్చారు. ఈ సర్వేను మరికొన్నాళ్లు కొనసాగించి.. పాత నిర్మాణాల్లో అక్రమాలనూ జల్లెడ పట్టాలని నిర్ణయించారు. గెడ్డలపై, మాస్టర్‌ప్లాన్‌లోని రోడ్ల ఆక్రమణలపై దృష్టిపెడుతున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే మరో ఆరు వేల ఆక్రమణలు బయటపడొచ్చనే అంచనా. మరోసర్వేలో 38 చెరువుల్లో ఆక్రమణలున్నట్లు గుర్తించారు. వీటిలో కొన్నింటికి ప్రభుత్వ పట్టాలూ ఇచ్చేయడం గమనార్హం.

కూల్చడమే తరువాయి

అక్రమ నిర్మాణాల్ని క్రమబద్ధీకరించుకునేందుకు భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌) కింద దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చేవారు. గతంలో బీపీఎస్‌కు నగరవ్యాప్తంగా 6,157 దరఖాస్తులొచ్చాయి. ఇందులో 5,180 అక్రమ నిర్మాణాల్ని జరిమానాలు వేసి క్రమబద్ధీకరించారు. మరో 140 పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలినవి క్రమబద్ధీకరణకు వీలుకాని ఆక్రమణలుగా తేల్చారు. తాజా ఆక్రమణల నేపథ్యంలో ఇకపై బీపీఎస్‌ ఉండదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇకపై వెలుగులోకి వచ్చే ప్రతి అక్రమ నిర్మాణాన్నీ ఆధారాలు చూపించి కూల్చివేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

ఎవరినీ ఉపేక్షించం - జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌

అన్ని ఆధారాలతో ఆక్రమణలుగా గుర్తించిన ప్రతి భవనంపైనా చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించం. ముందుగా అధికారుల విషయంలో క్రమశిక్షణగా ఉండాలని ఇటీవలే పట్టణ ప్రణాళిక విభాగంలో 10 మంది అధికారుల్ని తొలగించి ప్రభుత్వానికి సరెండర్‌ చేశాం.

ఇదీ చదవండి:

కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో 5 రెవెన్యూ డివిజన్లు

ABOUT THE AUTHOR

...view details