బాబాయిని ఎవరు చంపారని రాష్ట్రమంతా కోడై కూస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. బాబాయ్ హత్యకేసు దర్యాప్తును.. ఎవరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ చార్జిషీటును అంగీకరిస్తున్నారా? అంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. హత్య వెనుక చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని ఆరోపణలు చేయటంతోపాటు హైకోర్టులో సీబీఐ దర్యాప్తునకు పిటిషన్ వేసి, మళ్లీ ఎందుకు ఉపసంహరించుకున్నారని వర్లరామయ్య ప్రశ్నించారు.
దీనిపై సీఎంను సీబీఐ విచారించిందా? అని నిలదీశారు. ఇంటిదొంగలు బయటపడతారని నిద్రలేని రాత్రులు గడపలేదా? అని మండిపడ్డారు. సీబీఐ తన చార్జిషీట్ తో ఇంటిదొంగల్ని రక్షించినట్లేనా? అని ప్రశ్నించారు. వివేకా హత్య తర్వాత తన కుటుంబం రెండుగా చీలిపోయింది నిజం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్, ఆయన భార్య ఒకవైపు.. ఆయన తల్లి, చెల్లి మరోవైపు ఉన్నారని పులివెందులలో ప్రచారం జరుగుతోందని అన్నారు.