ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద సహాయక చర్యలపై తెదేపా ఆగ్రహం.. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

By

Published : Jul 18, 2022, 3:19 PM IST

Updated : Jul 18, 2022, 4:20 PM IST

TDP on floods compensation: వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. ముంపు బారిన పడ్డ ప్రజలు సర్వసం కోల్పోయారని.. వారికి కనీసం ఆహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని తెదేపా విమర్శించింది. వరద బాధితులకు ఇచ్చే సహాయం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించింది.

tdp
వరదలకు వైకాపాయే కారణమన్న తెదేపా

TDP on floods compensation: వరద సాయం పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. తెదేపా నేతలు ఆరోపించారు. వరదల వల్ల సర్వసం కోల్పోయిన వారికి కనీసం ఆహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని మండిపడ్డారు. ఏటిగట్లు బలహీనపడి గండి పడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందస్తు చర్యలు చేపడుతున్నా,.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ఈ నెల 21, 22 తేదీల్లో ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి బాధితులకు ధైర్యం చెప్తారని.. పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాణి లంకలో.. వరద బాధితులను ఆయన పరామర్శించారు. నాటు పడవపై ఆ ప్రాంతానికి చేరుకుని వరద నీటిలో ఇంటింటికి వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు సరిగ్గా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించారు.

భారీ వరదలు కారణంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ముంపునకు గురైన ప్రాంతాలను తెదేపా సభ్యుల బృందం పరిశీలించింది. ముంపునకు గురైన కాలనీలను పరశీలించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

లంక గ్రామాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందట్లేదని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రజలు వరద నీటిని వడపోచి తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. చిన్నపిల్లలకు పాలు దొరకట్లేదని తల్లులు బాధపడుతున్నారని అన్నారు.

పునరావాస శిబిరాల్లో భోజన వసతులు సరిగా లేవని ప్రజలు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో తెదేపా ప్రభుత్వం ఒక్కో గ్రామానికి 10 పడవలు కేటాయించిందన్న ఆయన.. లంక గ్రామాల్లో గర్భిణీలకు కూడా పడవ లభించని దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై వైకాపా ప్రభుత్వానికి ఎలాంటి ముందుచూపు లేదన్న ఆయన.. ఏటిగట్లకు ఈ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆరోపించారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 18, 2022, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details