ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రుయాలో కరోనా రోగులు చనిపోలేదు.. ప్రభుత్వమే చంపేసింది: లోకేశ్

By

Published : May 11, 2021, 3:28 PM IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రభుత్వం చెప్పే మరణాల సంఖ్య, సంఘటనకు గల కారణాలు... అన్నీ అవాస్తవాలే అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆస్పత్రిలో కరోనా రోగులు చనిపోలేదని.. ప్రభుత్వమే చంపేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

lokesh on ruia hospital incident
lokesh on ruia hospital incident

'రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చనిపోలేదు. ప్రభుత్వమే చంపేసింది. 11 మంది కాదు 30 మంది మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనటం, 11 మందే చనిపోయారు అనటం పెద్ద అబద్దం. అధికారులు వచ్చి మా ముందు మాట్లాడాలి అంటూ బాధితులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దొంగ మాటలు, దొంగ లెక్కలు మాని వాస్తవాలు బయట పెట్టాలి. మీడియాపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులతో వాస్తవాలు దాగవు' అని.. రుయా ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు.

ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారని లోకేశ్ తెలిపారు. ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన వారివి ప్రభుత్వ హత్యలుగా పరిగణించి వారి కుటుంబ సభ్యులను తక్షణమే ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

ప్రజలు చనిపోతుంటే వైకాపా నేతలు గుర్రపు స్వారీలా?

పడకలు దొరక్క, ఆక్సిజన్ లేక ఆసుపత్రుల్లో ప్రజలు చనిపోతుంటే వైకాపా ప్రజా ప్రతినిధులు ఇవేమీ పట్టనట్లు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారని లోకేశ్ ట్విట్టర్​లో ధ్వజమెత్తారు. 'కరోనా బారిన పడి వందల మంది చనిపోతుంటే వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం సరదాల్లో మునిగి తేలడం దారుణం. రుయా ఆసుపత్రికి 60 కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రభుత్వానికి, వైకాపా నాయకులకు ప్రజల ప్రాణాలు అంటే ఎంత లెక్కలేనితనమో.. గుర్రం మీద ఊరేగుతున్న నేతలే ఓ ఉదాహరణ.' అని దుయ్యబట్టారు.

కరోనాతో మాధవీలత మృతి విషాదకరం

తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పెదకాకాని గ్రామ సర్పంచ్ మండే మాధ‌వీలత కరోనాతో చనిపోవడం విషాదకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం

ABOUT THE AUTHOR

...view details