ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

By

Published : Feb 7, 2022, 3:23 AM IST

Updated : Feb 8, 2022, 1:55 AM IST

Ratha Saptami celebrations at Tirumala: రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. మంగళవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహన సేవలపై సప్తగిరీశుడు దర్శనమివ్వనున్నారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడే ఈ ఉత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహించనున్నారు. వాహన సేవలను ఆలయంలోని కల్యాణ మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి దర్శనాలను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబు
Ratha Saptami-2022 celebrations at tirumala

TTD: సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. సుర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్త వాహన సేవలపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణమూర్తిగా దర్శనమివ్వనున్నారు. అనంతరం 9 గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంతవాహనం, రెండు గంటలకు చక్రస్నానం, 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహిస్తారు.

వాహన సేవలు జరిగే ఆలయంలోని కల్యాణ మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. వాహన సేవల పటిష్టతను పరిశీలించి శుద్ధం చేసి ఉంచారు. వాహన సేవలను తిరువీధుల్లో నిర్వహించాలని భావించినప్పటికీ కరోనా మూడో వేవ్ కొనసాగుతుండడంతో ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. రథసప్తమిని తొలిసారి ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే.. వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.

శ్రీవారి దర్శనానికి ఆంక్షలు తొలగిస్తాం

ప్రస్తుతం ఉన్న కొవిడ్ అంక్షలను తొలగించి భక్తులు తిరుమల శ్రీవారిని సాఫీగా దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నైలోని శ్రీవారి ఆలయ నూతన సలహా మండలి సభ్యులతో ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మధురై, పుదుచ్చేరిలో ఆలయ నిర్మాణ సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. శ్రీవారి ఆలయాల నిర్మాణంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు ఆధ్యాత్మిక పరిమళాలతో సుసంపన్నం కానున్నాయని వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించి అక్టోబర్‌లో కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. తమిళనాడు నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం విశ్రాంతి గదులు నిర్మించనున్నట్లు ఛైర్మన్‌ వివరించారు. కరోనా వల్ల నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనాలను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామన్నారు.

ఇదీ చదవండి..

సమతామూర్తి క్షేత్రాన్ని సందర్శించిన.. పవన్​కల్యాణ్​

Last Updated : Feb 8, 2022, 1:55 AM IST

ABOUT THE AUTHOR

...view details