ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అందుకే.. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు'

By

Published : May 14, 2022, 8:26 PM IST

తెదేపా
తెదేపా ()

వేధింపులకు గురి చేయటంతోనే సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనమన్నారు. ఎస్సై ఆత్మహత్యపై డీజీపీ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.

ఎస్సై ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య వ్యవహారం.. పోలీసు శాఖకే అవమానమని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనమన్నారు. రాష్ట్రంలో గర్వంగా పోలీసు యూనిఫాం వేసుకుని విధులు నిర్వర్తించే ఒక అధికారికి.. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. దీనికి డీజీపీ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.

తెదేపా హయాంలో అన్ని శాఖల్లో సమర్థత, సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్​లు ఇచ్చామని గోరంట్ల పేర్కొన్నారు. కానీ నేడు కొన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కులం కారణంగా వందల మంది పోలీసు అధికారులకు.. మూడేళ్లుగా పోస్టింగులు నిలిపివేయడం వాస్తవం కాదా అని నిలదీశారు.

కాకినాడ సర్పవరం ఎస్సై ఆత్మహత్యపై విచారణ జరపాలని మాజీ హోంమంత్రి చినరాజప్ప డిమాండ్ చేశారు. వేధింపులకు గురి చేయటంతోనే ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు సామాజిక వర్గీయుల్ని వేధింపులకు గురిచేయడం.. వైకాపా ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు.

ఇదీ జరిగింది:ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్‌.ఐ.గా ఎంపికై ఉమ్మడి తూర్పుగోదావరిలో పని చేశారు. 2021 ఆగస్టు నుంచి కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబంతో కలిసి నాగమల్లితోట జంక్షన్‌లో నివాసముంటున్నారు. గురువారం సీఎం బందోబస్త్‌కు వెళ్లి వచ్చి నిద్రపోయారు. భార్య, ఇద్దరు పిల్లలు ఓ గదిలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో హాల్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం పొందారు. విధి నిర్వహణలో ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కానీ పోలీసు అధికారులు మాత్రం గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యిందని చెబుతున్నారు.

సంబంధిత కథనాలు :SI Suicide: కావాలనే కాల్చుకున్నారా..? మిస్ ఫైర్ అయ్యిందా..??

ABOUT THE AUTHOR

...view details