ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Koneru at lakshmi narasimha swamy temple: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చీకటి కోనేరు

By

Published : Dec 4, 2021, 9:01 PM IST

Koneru at lakshmi narasimha swamy temple: ప్రాచీన ఆలయాల్లో కోనేరు ఉండటం సాధారణం. గుడిలో జరిగే వైదిక కార్యక్రమాల నీటి కోసమే కాకుండా.. భక్తుల పుణ్యస్నానాలకు, ఉత్సవాలకు కోనేరును ఉపయోగిస్తుంటారు. కానీ.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందున్న కోనేరు నిర్మాణం వెనుక ఆసక్తికర కథనం ఉంది. చీకటి కోనేరుగా పిలుచుకునే ఈ కట్టడం.. ఆలయ గాలిగోపురం ఒరిగిపోకుండా సమతుల్యత కోసం కట్టడం విశేషం.

Koneru Renovation at sri Lakshmi narasimha swamy temple
మంగళగిరిలోని నరసింహస్వామి ఆలయంలో చీకటి కోనేరు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చీకటి కోనేరు

Koneru at lakshmi narasimha swamy temple: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన నరసింహ క్షేత్రాల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు హయాంలో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. 1807-09 మధ్యకాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా చెబుతారు. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ గోపుర నిర్మాణం పూర్తయిన తర్వాత వెనుక వైపునకు ఒరుగుతున్నట్లుగా శిల్పులు గుర్తించారు. అది నిలదొక్కుకునేందుకు కంచి నిపుణుల సలహాతో గాలిగోపురం ఎత్తుకు సమాన లోతుతో దానికి ఎదురుగా కోనేరు తవ్వారు. లోతుగా తవ్వటం వల్ల కోనేరు లోపలికి దిగితే చీకటిగా ఉండేది. అందుకే దీనికి చీకటి కోనేరుగా పేరొచ్చింది.

కోనేరులోని నీటిని ఆలయంలో పూజా కార్యక్రమాలకు వినియోగించేవారు. దివిసీమ ఉప్పెన తర్వాత కోనేరు పాడైపోయింది. నిర్వహణ లేకపోవటంతో దాని చుట్టూ గోడ కట్టి వదిలేశారు. ఈ ఆలయానికి సంబంధించి పట్టణంలో పెద్దకోనేరు కూడా ఉంది. అప్పట్లో ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానంతోపాటు తెప్పోత్సవం పెద్దకోనేరులో నిర్వహించేవారు. కోనేరులో నీరు పాడవటంతో ఇక్కడ ఉత్సవాలు ఆపేశారు.

మళ్లీ వినియోగంలోకి..
అయితే.. చీకటి కోనేరుని మళ్లీ వినియోగంలోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. కోనేరు శుద్ధి ప్రక్రియ చేపట్టగా లోపల చిన్నపాటి విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కోనేరు చుట్టూ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కాసేపు సేదతీరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోనేరు వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో 1912లో నిర్మించినట్లు చూపటాన్ని చరిత్ర తెలిసిన రచయితలు తప్పుపడుతున్నారు. చీకటి కోనేరుతో పాటు పెద్దకోనేరును కూడా శుద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details