ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jangareddygudem Issue: 'మంచి చేస్తారని వెళ్తే.. అబద్ధాలు చెప్పమన్నారు'

By

Published : Mar 16, 2022, 7:12 AM IST

Updated : Mar 16, 2022, 9:52 AM IST

Victims families: జంగారెడ్డిగూడెంలో సారా మరణాలుగా చెబుతున్నవన్నీ సహజ మరణాలేనంటూ ప్రభుత్వ పెద్దలు శాసనసభలో చేస్తున్న ప్రకటనలకు బలాన్ని చేకూర్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు బాధిత కుటుంబీకులే ధ్రువీకరిస్తున్నారు.

Jangareddygudem Victims families
జంగారెడ్డిగూడెంలో సారా మరణాలుపై బాధిత కుటుంబాలు

'మంచి చేస్తారని వెళ్తే.. అబద్ధాలు చెప్పమన్నారు'

Victims families: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 18 మంది మృతి చెందినా.. వారందరివీ సహజ మరణాలుగా నిరూపించాలని ప్రభుత్వం తంటాలు పడుతోంది. సహజ మరణాలేనని మీడియా ముందు చెప్పాలని బాధిత కుటుంబసభ్యులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మరణాలు వెలుగుచూసినప్పటి నుంచీ S.E.B. అధికారులు, పోలీసులు.. పదుల సంఖ్యలో తయారీదారులు, విక్రేతలపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో... తమవారివి సహజ మరణాలేనని మీడియా ముందు చెప్పాలంటూ.. బాధిత కుటుంబాలపై ఒత్తిడి పెంచుతున్నారు. సారా చావుల్ని సహజ మరణాలుగా చూపేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

'నాతో పాటు నాటుసారా వల్ల అండ కోల్పోయిన 12 కుటుంబాల వారిని ఏలూరుకు తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్నాం. మాకు భోజనం పెట్టారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో వీఆర్వోను కేటాయించి మావాళ్లు చనిపోయిన రోజు ఏం జరిగిందో, వారు ఎలా మరణించారో మమ్మల్ని అడిగారు. నాటుసారా వల్లే మావాళ్లు చనిపోయారని అందరం చెప్పాం. మేం చెప్పినవన్నీ రాసుకున్నారు. మా ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబరు, ఇతర వివరాలు తీసుకున్నారు' ఆ తరువాత.. "మేము మీడియాను పిలుస్తాం. మద్యం తాగే అలవాటుంది.. కానీ తినకుండా ఉండటం వల్లే మావాళ్లు అనారోగ్యానికి గురై చనిపోయారని చెప్పండి. తాగి చనిపోయారంటే నష్టపరిహారం రావడానికి సమయం పడుతుంది. మేం చెప్పినట్లు చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా చేస్తాం. మీకు ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుంది" అని అక్కడుండే ఓ అధికారి మాకు చెప్పారు. అలా అని నిర్బంధం చేయలేదు. "మాకు మీరు ఎలాంటి సాయం చేయకపోయినా ఫరవాలేదు. మావాళ్లను పోగొట్టుకుని ఇంత దూరం వచ్చాం. నిజమే చెబుతాం తప్ప అబద్ధం చెప్పబోం. కల్తీసారా వల్ల మావాళ్లను కోల్పోయి దిక్కుతోచక ఉన్న మాకు సాయం చేస్తే చేయండి. లేదా మమ్మల్ని పంపించేయండి" అని చెప్పి అందరం వచ్చేశాం' -బి.రాంబాబు కుమార్తె

"మాకు మీ డబ్బులొద్దు.. ఏమీ వద్దు.. అలా చెప్పం అన్నాం. సారా మరణాలని చెబితే ప్రభుత్వం నుంచి డబ్బులేమీ రావన్నారు. మా పిల్లలకు మంచి చేస్తారేమోననే ఆశతో వెళితే అబద్ధాలు చెప్పమన్నారు" -పితాని రమణ భార్య విజయలక్ష్మి

సోమవారం ఏలూరుకు వెళ్లిన మరో రెండు కుటుంబాలవారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. "నాటుసారా కట్టడికి చర్యలు తీసుకుని మాకు సాయం చేసి పరిస్థితిని చక్కదిద్దడం మాని.., విషయాన్ని దాచేందుకు ప్రభుత్వం ఎందుకింత చేస్తోందో అర్థం కావట్లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

22 మందిపై కేసులు

Victims families: జంగారెడ్డిగూడెంలో తాజాగా చాలా మరణాలకు కల్తీసారానే కారణమని ఈ సంఘటనలతో సంబంధం లేనివారు కూడా చెబుతున్నారు. సారా ప్రభావం లేదని చెబుతున్న యంత్రాంగం హడావుడిగా పలువురిని ఎందుకు అరెస్టు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో 243 లీటర్ల నాటుసారా, 18,300 లీటర్ల బెల్లంఊటను ఎస్‌ఈబీ అధికారులు ధ్వంసం చేశారు. 63,048 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. 22మందిపై కేసులు పెట్టి నలుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

'సారా మరణాలపై అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ పచ్చి అబద్దాలు చెప్పారు'

Last Updated : Mar 16, 2022, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details