ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గడ్డి చుట్టే యంత్రంలో చేయి పడి యువకుడి మృతి

By

Published : Nov 12, 2020, 10:32 AM IST

యంత్రంలో చేయి ఇరుక్కుపోయింది.. ఒంట్లోని రక్తమంతా బొట్టుబొట్టుగా కారిపోతోంది.. సాయానికి చుట్టుపక్కల ఎవరూ లేరు.. నొప్పితో అరిచి అరిచి గొంతెండి పోతోంది.. కళ్లు మూసుకుంటే అమ్మానాన్నా, అక్కాచెల్లెళ్లు కనిపిస్తున్నారు.. ఇక్కడితో తన జీవితం ముగిసిపోనుందని తెలిసిపోతోంది.. ప్రాణం తల్లడిల్లుతోంది. అలాగే గంటపాటు నరకం అనుభవించి స్పృహ కోల్పోయాడు.. చివరకు ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలో జరిగింది..

young-man-died
young-man-died

తెలంగాణ.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక గ్రామానికి చెందిన జంగ రాజయ్య, సాంబ లక్ష్మి దంపతుల కుమారుడు మహేశ్‌ (22) ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు ఆపేసి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా చేరాడు. బుధవారం ట్రాక్టర్‌ యజమానితో కలిసి గిద్దెముత్తారం శివారులోని పొలంలో వరి గడ్డి కట్టలు కట్టేందుకు వెళ్లాడు. యంత్రం సహాయంతో గడ్డిని చుట్టలు చుడుతుండగా.. ఉండలు కట్టే దారం అయిపోవడంతో కొత్తది తెచ్చేందుకని యజమాని ఊళ్లోకి వెళ్లాడు.

ఇంతలో యంత్రంలో సమస్య ఏర్పడింది. ఇంజిన్‌ నడుస్తుండగానే దాన్ని సరి చేయబోగా ప్రమాదవశాత్తు మహేశ్‌ చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. బాధతో కేకలు వేశాడు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో గంటసేపు నరకం అనుభవించాడు. ట్రాక్టర్‌ యజమాని వచ్చేసరికి మహేశ్‌ రక్తంకారి అచేతనంగా పడిపోయి ఉన్నాడు. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి చూసేసరికి మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

ABOUT THE AUTHOR

...view details