ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?

By

Published : May 28, 2022, 9:37 AM IST

Sirpurkar Commission Report : దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పుర్కర్ కమిషన్ నివేదిక కేవలం కొందరు అధికారులనే తప్పుపట్టం అంతుపట్టకుండా ఉంది. కొందరే తప్పు చేశారని కమిషన్ ఎలా చెప్పింది? కమిషన్ తప్పుబట్టిన వారిలో ఎక్కువగా కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. అయితే కిందిస్థాయి సిబ్బంది అంతటి నిర్ణయాన్ని సొంతంగా తీసుకుని అమలు చేయగలుగుతారా..? ఎన్‌కౌంటర్‌కు పరోక్షంగా కారణమైన పాలకులు, ఉన్నతాధికారులు, మీడియా వర్గాలు, ప్రజలను కమిషన్ ఎందుకు తప్పు పట్టలేదు..?

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?
దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?

Sirpurkar Commission Report : రెండేళ్ల క్రితం తెలంగాణలోని హైదరాబాద్‌ శివార్లలో ‘దిశ’పై అత్యాచారం, హత్య తరవాత దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పోలీసులు, పాలకుల సామర్థ్యం, విశ్వసనీయతపై ప్రజలు, కొన్ని ప్రసార మాధ్యమాల నుంచి తీవ్ర ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘దిశ’కు తక్షణ న్యాయం జరగాలన్న డిమాండు ఊపందుకొంది. ఫలితంగా పాలకులు, పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఆ కేసుకు సంబంధించి పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఆ తరవాత, దర్యాప్తు నిమిత్తం నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్నారు.

అనంతరం నిందితులు తమపై దాడిచేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, ఆ క్రమంలో ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో వారు మరణించారని పోలీసులు తెలిపారు. దానిపై ఏర్పాటైన సిర్పుర్కర్‌ కమిషన్‌ పోలీసులు చెప్పినదంతా అసత్యమని తేల్చింది. పదిమంది పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, కేవలం ఆ కొందరే తప్పు చేశారని కమిషన్‌ ఎలా చెప్పింది? ఎన్‌కౌంటర్‌కు పరోక్షంగా కారణమైన పాలకులు, ఉన్నతాధికారులు, మీడియా వర్గాలు, ప్రజలను కమిషన్‌ ఎందుకు తప్పు పట్టలేదో అర్థం కావడంలేదు.

‘దిశ’ హత్యాచార నిందితుల అరెస్టు నుంచి, వారి మరణం దాకా అంతా పాలకులు, పోలీసు ఉన్నతాధికారుల ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా కనిపిస్తోంది. లేకపోతే కిందిస్థాయి సిబ్బంది అంతటి నిర్ణయాన్ని సొంతంగా తీసుకొని అమలు చేయగలుగుతారా? పోలీస్‌ కస్టడీకి మైనర్‌ నేరస్థులను అప్పగించడం, ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం, సమయం... వంటి వాటిపై అప్పట్లో పెద్దగా ఎవరూ ఎలాంటి ప్రశ్నలనూ సంధించలేదు. నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనే ప్రజల డిమాండును కొన్ని మాధ్యమాలు ప్రసారం చేశాయి. కొందరు రాజకీయ నేతలు సైతం ఆ వాదనలను సమర్థించారు. ఆ విధంగా నాయకులు, అధికార వర్గాలు, ప్రజలు నిందితులను అంతం చేయడానికి పోలీసులను ప్రోత్సహించారు. అలాంటప్పుడు కేవలం పది మందిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కమిషన్‌ ఎలా సిఫార్సు చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. విచారణ నివేదికలో ఈ కీలక అంశాలపై ఎలాంటి చర్చా జరగలేదు.

భౌతిక చర్యలకు కారణమైన అపరాధ మనసు(గిల్టీ మైండ్‌)ను శిక్షించడం భారత శిక్షాస్మృతి ప్రథమ నియమం. ‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంలో ఆ పదిమంది పోలీసులకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం, ఆసక్తి ఉండే అవకాశాలు లేవు. ఉన్నతాధికారుల సూచనల మేరకే వారు తమ విధిని నిర్వర్తించినట్లుగా భావించాలి. ఆ రకంగా వారు కేవలం భౌతిక సాధనాలు మాత్రమే. వారి చర్యల వెనక ఉన్న అపరాధ మనసులు... పాలకులు, అధికార వర్గాలు, ఇతరులవి కావా? నిజానికైతే వారూ అభియోగాలను ఎదుర్కోవాలి. ఆ వాస్తవాన్ని కమిషన్‌ ఎందుకు పట్టించుకోలేదు? ‘దిశ’ హత్యాచారం తరవాత సమాజంలోని అన్ని వర్గాల్లో పెల్లుబికిన హింసాత్మక ఆగ్రహావేశాల వెనక అసలు కారణాలను కమిషన్‌ విశ్లేషించకపోవడమూ బాధాకరం. భవిష్యత్తులో ప్రజలనుంచి అలాంటి ఒత్తిళ్లు తలెత్తితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఏమీ చెప్పలేదు. పైగా కమిషన్‌ ఒక నిర్ధారణకు రావడానికి మూడేళ్ల సమయం ఎందుకు పట్టిందో అర్థంకాదు.

'‘దిశ’కు జరిగింది ఘోర అన్యాయమే. దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించి ఉండాల్సింది. తక్షణ న్యాయం కోసం ప్రయత్నిస్తే అసలైన న్యాయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రాణాలను తీసే అధికారాన్ని ఏ చట్టమూ పోలీసులకు కట్టబెట్టలేదని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటాచలయ్య గతంలో స్పష్టీకరించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఎన్‌కౌంటర్లపై విచారణలో పాటించాల్సిన పలు విధివిధానాలనూ గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. వాటిని పటిష్ఠంగా అనుసరించాలి. సకాలంలో న్యాయం అందితేనే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా జనావళిలో ఆ నమ్మకం కలిగించడంలో దేశం వెనకబడింది. చట్టాలను కాలరాస్తే అంతిమంగా పౌర హక్కులు ప్రమాదంలో పడతాయి. ఆ హక్కులకు మన్నన దక్కాలంటే న్యాయ, పోలీసు సంస్కరణలు కార్యరూపం దాల్చడం అత్యవసరం.' --- జి.అనిల్‌ కిరణ్‌ కుమార్‌ (జిల్లా, సెషన్స్‌ మాజీ న్యాయమూర్తి)

ఇదీ చదవండి :

'మాకు కావాల్సింది ఎన్​కౌంటర్లు కాదు.. 'రక్షణ''

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం: సిర్పూర్కర్ కమిషన్

'దిశ' యాప్​ను ఆవిష్కరించిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details