ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TRS MLC Candidates: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తులెంతో తెలుసా..? ఎన్ని కేసులున్నాయంటే..?

By

Published : Nov 18, 2021, 11:21 AM IST

తెలంగాణలో తెరాస తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన నేతల(trs mlc candidates list in telangana 2021)పై ఎలాంటి కేసులున్నాయి..? వాళ్లకు ఎంత ఆస్తి ఉంది..? వాళ్లు సమర్పించిన అఫిడవిట్​లు ఏం చెబుతున్నాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరూ చూసేయండి.. ఎవరిపై ఎన్ని కేసులున్నాయో..? ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయో..?

TRS MLC Candidates
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తులెంతో తెలుసా..?

తెలంగాణలో ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌.. పార్టీ అభ్యర్థుల (TRS MLC Candidates 2021)ను ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాశ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డిలను ఖరారు చేశారు. చివరి నిమిషంలో వెంకట్రామరెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు జాబితా (trs mlc candidates list in telangana 2021)లో చేరాయి. కాగా.. నామినేషన్లు వేసిన ఈ నేతలపై ఎలాంటి కేసులున్నాయి..? వాళ్లకు ఎంత ఆస్తి ఉంది..? వాళ్లు సమర్పించిన అఫిడవిట్​లలో ఏముందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అభ్యర్థుల్లో మాజీ ఐఏఎస్​తో పాటు గతంలో పదవులు అనుభవించినవాళ్లు.. కాంగ్రెస్​ నుంచి వచ్చిన కౌశిక్​రెడ్డి కూడా ఉండటం వల్ల ఈ అంశాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఒక్క కేసు కూడా లేదు..

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిపై ఒక్క కేసు కూడా లేదు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్​లో ఆయన పేర్కొన్నారు. తనకు ఎలాంటి వాహనాలు కూడా లేవని తెలిపారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, బండ ప్రకాష్​ మీద ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి. వెంకట్రామిరెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలకు కూడా సొంత వాహనాలు లేవు.

ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి..

కౌశిక్ రెడ్డికి మాత్రం స్థిరాస్తులు భారీగా ఉన్నాయి. రూ. 33 కోట్లకు పైగా విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్​లో పేర్కొన్నారు. మరో రూ. 93 లక్షల చరాస్తులు, భార్య పేరిట రూ. 7.5 కోట్ల విలువైన స్థిర, 25 లక్షల చరాస్తులు ఉన్నాయి. వెంకట్రామిరెడ్డి వద్ద 1.15 కోట్ల చర, 1.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట 5.04 కోట్ల చర, 2.6 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రవీందర్​రావు పేరిట 13.53 కోట్ల విలువైన స్థిరాస్తులు, 12 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట 1.92 కోట్ల స్థిరాస్తులు, 67.56 లక్షల చరాస్తులు ఉన్నాయి. బండ ప్రకాష్ పేరిట 2.49 కోట్ల స్థిర, 30 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట 7.09 కోట్ల స్థిర, 1.23 కోట్ల చరాస్తులు ఉన్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి పేరిట 97.77 లక్షల చర, 36.57 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. భార్య పేరిట 1.67 కోట్ల చర, 5.89 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. హిందూ అవిభాజ్య కుటుంబ వాటాలో తనకు 6.29 కోట్ల చర, 5.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. కడియం శ్రీహరి పేరిట ఆరు లక్షల చర, 25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట 39 లక్షల చర, 2.9 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

ఇదీ చూడండి:VIVEKA MURDER CASE : కొనసాగుతున్న విచారణ... కడపకు శివశంకర్‌రెడ్డి తరలింపు

ABOUT THE AUTHOR

...view details