ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న ముప్పు'.. కమిటీ తుది నివేదికలో వెల్లడి

By

Published : Apr 21, 2022, 5:35 AM IST

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరద మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని.. లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో స్పిల్‌వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం.., కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడాన్ని పరిశీలించాలని సూచించింది. ప్లంజ్‌పూల్‌ సహా డ్యాం, స్పిల్‌వేకి మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫారసు చేసింది. ప్రస్తుత స్పిల్‌వే సామర్థ్యానికి తగినట్లు లేదని స్పష్టంచేసింది.

Srisailam Dam
Srisailam Dam

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో స్పిల్‌వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి పరిశీలించాలని సూచించింది. ప్లంజ్‌పూల్‌ సహా డ్యాం, స్పిల్‌వేకు సంబంధించిన మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫార్సు చేసింది. ప్రస్తుత స్పిల్‌వే సామర్థ్యానికి తగినట్లు లేదని తెలిపింది.

'శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న ముప్పు'

శ్రీశైలం డ్యాం భద్రతపై కొన్నేళ్లుగా పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. వీటి సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. 2021లో సీడబ్ల్యూసీ శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి ఓ నివేదిక సమర్పించింది. గత కమిటీల సిఫార్సులు, సీడబ్ల్యూసీ పరిశీలనలో తేలిన అంశాలు, చర్యలపై పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదిక ఇచ్చింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

గరిష్ఠ వరద ప్రవాహంపై మళ్లీ అధ్యయనం: ‘వెయ్యేళ్లలో అత్యధిక వరద ప్రవాహం అవకాశాలపై 2006లో అధ్యయనం చేయగా, 26.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తేలింది. ప్రస్తుతం ఉన్న స్పిల్‌వే సామర్థ్యం 13.20 లక్షల క్యూసెక్యులు. గరిష్ఠ నీటి మట్టం 890 అడుగులను పరిగణనలోకి తీసుకొంటే 14.55 లక్షల క్యూసెక్కులు. అయితే 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. డ్యాంలో నీటిమట్టం 896 అడుగులకు చేరగా 14.80 లక్షల క్యూసెక్కులు గేట్ల ద్వారా బయటకు వదిలారు. 2006లో గరిష్ఠ వరద ప్రవాహంపై అధ్యయనం చేస్తే 2009లోనే దానికి దగ్గరగా వచ్చింది. కానీ 2021లో అధ్యయనం చేసిన కేంద్ర జలసంఘం దీనిపై ఏమీ మాట్లాడలేదు. మా అధ్యయనం ప్రకారం గరిష్ఠ వరద 17.88 లక్షల క్యూసెక్కులు. మొత్తం పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు 256 ఉప పరీవాహక ప్రాంతాలుగా విభజించి సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది’ అని పాండ్యా కమిటీ తన నివేదికలో పేర్కొంది. డ్యాం భద్రతకు చర్యలు ప్రారంభించే ముందు పీఎంఎఫ్‌పై మళ్లీ అధ్యయనం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.

ప్లంజ్‌పూల్‌కు భారీ గుంత:స్పిల్‌వే గేట్ల నుంచి నీళ్లు కింద పడి మళ్లీ ఎగిరి పడే ప్రాంతం (ప్లంజ్‌పూల్‌)లో ఏర్పడిన భారీ గుంత డ్యాం భద్రతకు ముప్పు. దీనిపై వెంటనే కార్యాచరణకు పూనుకోవాలి.

*ప్లంజ్‌పూల్‌ కుడి, ఎడమగట్లకు తదుపరి నష్టం వాటిల్లకుండా మరమ్మతులు చేపట్టాలి. ప్రధాన స్పిల్‌వే గేట్ల నుంచి నీటి లీకేజీ నివారణ వంటి చర్యలు తీసుకోవాలి.

*రివర్‌ స్లూయిస్‌ గేట్లకు అత్యవసర సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తక్షణమే దృష్టి పెట్టాలి.

*డ్యాంకు ఎగువన 5 కి.మీ. దూరంలో అదనపు స్పిల్‌వే నిర్మాణానికి అవకాశం ఉంది. అదనపు స్పిల్‌వేకు బ్రీచింగ్‌ సెక్షన్‌ (అవసరమైతే గండి కొట్టే ఏర్పాటు) ఉండాలి.

*కొంత వరదను కుడివైపు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా చెన్నై తాగునీటికి, ఇతర ప్రాజెక్టులకు మళ్లించవచ్చు. ఎడమవైపున ఎగువ భాగంలో నీటిని మళ్లించడానికి అనువైన ప్రాంతం ఉంది.

*కేంద్ర జలసంఘం, ఐఎండీల వద్ద వరద అంచనాకు ఆధునిక వ్యవస్థలున్నాయి. వీటిని ఉపయోగించుకొని ముందుగానే డ్యాంలో నీటిని ఖాళీ చేయడం ఒక మార్గం.

*ప్రస్తుత స్పిల్‌వేకు ఎక్కువ ఎత్తులో గేట్లు ఉండేలా మార్పు చేయడం, స్పిల్‌వే క్రస్ట్‌లెవెల్‌ తగ్గించడంపై ఆలోచించాలి. ప్రస్తుత గరిష్ఠ నీటి నిల్వకు తగ్గట్లుగా డ్యాం ఎత్తు పెంచడానికి ముంపు సమస్యనూ పరిగణనలోకి తీసుకోవాలి.

ఇదీ చదవండి:SECI: సెకి కొనుగోలు చేసే విద్యుత్‌లో.. రెండొంతులు అదానీ సంస్థదే

ABOUT THE AUTHOR

...view details