ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bathukamma day 2: రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'.. నైవేద్యం ఏంటంటే?

By

Published : Oct 7, 2021, 8:23 AM IST

పూలపండుగ సంబురాలతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కోలాహలంగా మారాయి. ఊరు, వాడలు పూల వనాలుగా మారుతున్నాయి. పెత్రమాస నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. రెండో రోజు బతుకమ్మ పేరేంటి? నైవేద్యం ఏంటో తెలుసా?..

2nd day
2nd day

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిదిరోజుల పాటు ఈ సంబురాలు జరుపుకుంటారు. తీరొక్క పూలు, పసుపు, కుంకుమలతో పసుపు గౌరమ్మను కొలుస్తారు. తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని తయారుచేస్తారు. నేడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఇవాళ అటుకుల బతుకమ్మగా గౌరమ్మను కొలుస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. దేవీ శరన్నవరాత్రులు కూడా నేటి నుంచే ప్రారంభమవుతాయి.

రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'.. నైవేద్యం ఏంటంటే?

తొమ్మిది రోజుల పండుగ

తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని కొలుస్తారు. ఆడబిడ్డలందరూ ఈ నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మ పేరిట ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రెండో రోజు అటుకుల బతుకమ్మగా అమ్మావారిని పూజిస్తారు. ఆ గౌరమ్మకు ఇష్టమైన అటుకులతో నైవేద్యం తయారుచేస్తారు. తంగేడు, గునుగు, బంతి, తామర, వివిధ రకాల గడ్డిపూలతో బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేరుస్తారు.

కోలాటాల కోలాహలం

విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసువుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు, బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా, సోదరభావం, ప్రేమానురాగాలతో జరుపుకుంటారు. ఈ క్రమంలో వరుసైనవాళ్లు కాసేపు ఆటలాడుకుంటారు. అనంతరం ఆ గౌరమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ తర్వాత అటుకులతో తయారు చేసిన నైవేద్యాన్ని ఒకరికొకరు పంచుకుంటారు.

సందడిగా తెలంగాణ లోగిళ్లు

అచ్చమైన పల్లెసంస్కృతికి అద్దం పట్టే మట్టిమనుషుల పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలతో తెలంగాణ లోగిళ్లు కళకళలాడుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. పిండి వంటల ఘుమఘుమలు... పుట్టినింట్లో ఆడబిడ్డల చిరునవ్వులు, బంధుమిత్రుల కోలాహలం.. పిల్లపాపలతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఓ పక్కన పెద్దలు బతుకమ్మ ఆడుకుంటుంటే.. మరోపక్కన పిల్లలు కేరింతలు కొడుతుంటారు. తొమ్మిది రోజుల పాటు పిల్లాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు.

ఇదీ చదవండి:engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ

ABOUT THE AUTHOR

...view details