ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Registration charges: తెలంగాణలో మరోసారి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. వచ్చేనెల నుంచే అమలు!

By

Published : Jan 21, 2022, 10:41 AM IST

Registration charges:తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్‌ విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం మేరకు వ్యవసాయ భూముల విలువలను 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్ట్‌మెంట్ల విలువను 25 శాతం పెంచాలని నిర్ణయించింది.

Registration charges
Registration charges

Registration charges: తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు మరోమారు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్‌ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం మేరకు వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు బహిరంగ మార్కెట్‌లో విలువలు భారీగా ఉన్నచోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్‌ విలువల్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చేలా వారం రోజుల్లో పెంపు కార్యాచరణ వేగవంతం చేయాలని రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించింది.

పెంచి ఏడాది గడవక ముందే..

ఏడేళ్ల అనంతరం గత ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంపు రుసుంలను ప్రభుత్వం పెంచింది. దాదాపు 20 శాతం మేర వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్‌ విలువలను సవరించింది. తాజాగా మరోమారు పెంచనుంది. మార్కెట్‌ విలువ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపుపై గురువారం రిజిస్ట్రేషన్‌ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ శేషాద్రి, సంయుక్త ఐజీలు జిల్లా రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశాల్లో మార్కెట్‌ విలువల్ని ఏమేరకు సవరించాలన్న విషయమై కసరత్తు నిర్వహించారు. ఒకట్రెండు రోజుల్లో ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చి ప్రభుత్వానికి అందజేయనున్నారు. సర్కారు నిర్ణయం మేరకు మార్కెట్‌ విలువల్ని సవరించి, అమలు చేయనున్నట్లు సమాచారం.గత ఏడాది జులై22 నుంచి సవరించిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం 75 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం..తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్‌ రేటును 50 శాతం పెంచగా.. మధ్యశ్రేణి భూముల విలువను 40శాతం, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30శాతం మేర పెంచింది. అదే విధంగా ఖాళీస్థలాల కనీస ధర చదరపు గజానికి రూ.200గా నిర్ణయించింది. వీటి విలువను కూడా 50శాతం, 40శాతం, 30 శాతంగా పెంచింది. అపార్టుమెంట్ల ధరల్లో చదరపు అడుగు కనీస ధర రూ.వేయిగా నిర్ణయించగా కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 30 శాతం పెంచారు. దీంతో పాటు స్టాంపు డ్యూటీ విలువ, రిజిస్ట్రేషన్ల రుసుంలను సర్కారు పెంచింది.

ఇదీ చూడండి:

AP Cabinet Meeting: నేడు మంత్రివర్గ సమావేశం.. 32 అంశాలతో అజెండా

ABOUT THE AUTHOR

...view details