ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దంచికొట్టిన వాన.. పోటెత్తిన మూసీ.. నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు!

By

Published : Jul 27, 2022, 11:49 AM IST

Heavy Rains In Telangana: తెలంగాణలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతూ ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. బుధ, గురువారాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. కుండపోత వర్షాలతో ఈసీ, మూసీ, కాగ్నా నదులకు పెద్దఎత్తున వరద వచ్చి ఇళ్లు, పంటలు నీటమునిగాయి.

తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains In Telangana: కుంభవృష్టి వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన భారీ వర్షాలు మంగళవారం కూడా కొనసాగడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతూ పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధ, గురువారాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

నగరంలో వరుణుడి విధ్వంసం..
హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా సోమవారం అర్ధర్రాతి విధ్వంసం సృష్టించిన వరుణుడు మంగళవారమూ విశ్రాంతి తీసుకోలేదు. చాలాచోట్ల.. కుండపోతగా వాన కురిసింది. చెరువులు పోటెత్తడంతో నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటిలో కూరుకుపోయాయి. రాకపోకలు స్తంభించాయి. అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూకట్‌పల్లి, బుల్కాపూర్‌ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్‌, బహదూర్‌పుర, మలక్‌పేట ప్రాంతాల్లో కొన్నిచోట్ల దుర్గంధం ప్రబలింది. బురద మేటలు వేసింది. కూరగాయల మార్కెట్లు, కాలనీ రహదారులు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ముఖ్యంగా.. నగరానికి 80 శాతం మాంసాన్ని సరఫరా చేసే జియాగూడ కబేళా పరిసరాలు ఆందోళనకరంగా మారాయి. ఎంజీబీఎస్‌, హైకోర్టు, ముసారంబాగ్‌ తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థితిలో మూసీ వరద ఉంది. మూసారంబాగ్‌ వంతెనపై రాకపోకలను నిషేధించారు.

పోటెత్తిన మూసీ, కాగ్నా..
రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఈసీ, మూసీ, కాగ్నా నదులకు పెద్దఎత్తున వరద వచ్చి ఇళ్లు, పంటలు నీటమునిగాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పలుచోట్ల 150 ఇళ్లు నీటమునిగాయి. వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలోకి సైతం వరద నీరు వచ్చింది. మరోసారి రికార్డు స్థాయిలో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు వరద పోటెత్తుతోంది. మంగళవారం రాత్రి రాత్రి 10 గంటల వరకు 13 వేల క్యూసెక్కులను మూసీలోకి విడిచిపెడుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సిద్దిపేట జిల్లా కోహెడ రహదారిపై మోయతుమ్మెద వాగు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలో మల్కాపూర్‌, తొగరపు చెరువులు మత్తడిపై వరద ప్రవహిస్తోంది. తొగరపు చెరువు వరదతో 10 కుటుంబాలు చిక్కుకున్నాయి.

547.50 అడుగులకు చేరిన సాగర్‌
నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు ఈ నెల 28న మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేయనున్నట్లు డ్యామ్‌ ఎస్‌ఈ ధర్మనాయక్‌ తెలిపారు. మరోవైపు జలాశయ నీటిమట్టం 547.50 (గరిష్ఠం 590.00) అడుగులకు చేరింది. సాగర్‌ నుంచి 1,000 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది.

వరదలో చిక్కిన యువకుడిని కాపాడిన పోలీసులు

వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్కు చెందిన అరవింద్‌గౌడ్‌ చాంద్రాయణగుట్టలోని తన బంధువుల ఇంటికి వెళ్తూ వరదలో చిక్కుకున్నాడు. బీటెక్‌ చదువుతున్న అరవింద్‌ పరీక్షలు సమీపిస్తుండటం.. గ్రామంలో విద్యుత్‌ సమస్య ఉండటంతో బంధువుల ఇంట్లో చదువుకునేందుకు రీడింగ్‌ ఛైర్‌, పాఠ్యపుస్తకాలతో ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఓఆర్‌ఆర్‌ సర్వీసురోడ్డులో రాజేంద్రనగర్‌ వైపు వస్తున్నాడు. అదే సమయంలో వరద భారీగా పారుతోంది. అయినా ద్విచక్రవాహనంతో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. వరద తాకిడికి రోడ్డు చివర వరకు వెళ్లి రెయిలింగ్‌ను పట్టుకొన్నాడు. 45 నిమిషాలపాటు అలాగే ఉండిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికివచ్చి గొలుసు సహాయంతో యువకుడిని వాహనాలు రికవరీ చేసే వ్యాన్‌లోకి ఎక్కించారు. అదే గొలుసును ద్విచక్రవాహనానికి కట్టి బయటకు లాక్కొచ్చారు.

ఎందుకీ వానలు..
రాజస్థాన్‌ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్‌ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా మదనపల్లి, వికారాబాద్‌లలో 13, మద్గుల్‌ చిట్టెంపల్లిలో 12.4, మన్నెగూడలో 10.5, హైదరాబాద్‌ నగర శివారు చర్లపల్లిలో 10.9, హస్తినాపురంలో 9.8, డబీర్‌పుర, ఐఎస్‌ సదన్‌లలో 9.4, భువనగిరి(యాదాద్రి)లో 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ 12 గంటల వ్యవధిలో పలుచోట్ల కుండపోత వర్షం పడింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా కందువాడలో 13.5, షాబాద్‌లో 12.3, తాళ్లపల్లిలో 10.2, కేతిరెడ్డిపల్లిలో 9.8, చందనవల్లిలో 9.4, పెద్దషాపూర్‌లో 7.1, రెడ్లవాడ(వరంగల్‌)లో 11.7, పమ్మి(ఖమ్మం)లో 8.2 సెం.మీ.ల వర్షం కురిసింది.

వరంగల్‌ నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థ ఇది. నగరం నడిబొడ్డున ఉన్న కృష్ణ కాలనీలోని ఈ ప్రాంగణంలో పాఠశాల, బాలికల జూనియర్‌ కళాశాల కొనసాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి తర్వాత కుండపోతగా కురిసిన వర్షానికి ఈ విద్యాసంస్థలోని గదులన్నీ జలమయమయ్యాయి. విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు.

మూసీలో చిక్కుకున్న కుటుంబం.. రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌
గండిపేట జలాశయం దిగువన మూసీ కాలువ సమీపంలో ఉంటున్న ఓ కుటుంబం వరదలో చిక్కుకుంది. గండిపేట నుంచి చిలుకూరు వెళ్లే దారిలోని కల్వర్టు సమీపంలో ఓ చిన్న ఇంట్లో ఉంటున్న సునీల్‌, ఆయన భార్య లక్ష్మి, వారి ముగ్గురు పిల్లలు వరదలో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అర్ధరాత్రి పడవలో అక్కడికి వెళ్లి కుటుంబం మొత్తాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఇదీ చదవండి:పిడుగుపాటుకు 40 మంది బలి.. పశువుల్ని మేపుతూ అక్కడికక్కడే..!

ABOUT THE AUTHOR

...view details