ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Protest: సంక్షోభంలో సంక్షేమం పేరుతో.. తెదేపా శాసనసభా పక్షం నిరసన

By

Published : Sep 20, 2022, 10:08 AM IST

Updated : Sep 20, 2022, 10:22 PM IST

Protest
తెదేపా నిరసన

TDP Protest: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసి సంక్షోభం సృష్టించిందని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. వివిధ సంక్షేమ పథకాల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ పరిసరాల్లో దశలవారీ ఆందోళనలు చేపట్టింది. తక్షణమే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేయడంతోపాటు రద్దుచేసిన అన్నాక్యాంటిన్లు, పెళ్లి, పండుగ కానుకలు, విదేశీ విద్య పథకాలను పునరుద్దరించాలని డిమాండ్‌చేశారు. తెదేపా ఎస్సీ సెల్‌ చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

TDP Protest: సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేశ్​ ఆధ్వర్యంలో తెదేపా శాసనసభా పక్షం నిరసన చేపట్టింది. వివిధ సంక్షేమ పథకాల రద్దును నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేడ్కర్ విదేశీ విద్య పథకాల రద్దును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్ ప్లాన్ నిధుల పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా పింఛన్​ కోత తదితర అంశాలపై ఆందోళన చేపట్టారు.

తెదేపా నిరసన

రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయవంచన నినాదాలతో కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని తెదేపా నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. వైకాపా నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. పేదల పథకాలు రద్దు చేసిందని, ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు.

"వైకాపా ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. తెలుగుదేశం అమలు చేసిన పథకాలు సగం కూడా ఇవ్వట్లేదు. వైకాపా నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి." -చినరాజప్ప

"వైకాపా ప్రభుత్వం పేదల పథకాలు రద్దు చేసింది. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం."-నిమ్మల రామానాయుడు

సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి బడుగు బలహీన వర్గాలను నాశనం చేస్తోందంటూ తెదేపా ఎస్సీ నేతలు ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఛలో అసెంబ్లీకి వెళ్తున్న తెదేపా ఎస్సీ నాయకురాలు కంభంపాటి శిరీష పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.మల్కాపురం వద్ద శిరీషను తాళ్లతో కట్టి మగ పోలీసులు లాగారు. పోలీసుల తీరు పట్ల శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలో తెలుగుదేశం నేతలు ఓ భవనం ఎక్కి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో తెదేపా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు. దళిత ద్రోహి సీఎం అంటూ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేతల్ని పోలీసులు బలవంతంగా భవనంపై నుంచి దించి అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అసెంబ్లీ సమీపంలో పలువురు కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అతి కష్టం మీద వారినీ పోలీసులు కిందకు దింపారు.

తెదేపా నిరసన

అప్రమత్తమైన పోలీసులు: తెలుగుదేశం ఛలో అసెంబ్లీకి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాలను డ్రోన్‌తో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పొలాల నుంచి వస్తారనే అనుమానంతో పొలాల చుట్టూ డ్రోన్లు అమర్చారు. అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 20, 2022, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details