ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Marriage Cancel: డిగ్రీ లేదని వివాహం రద్దు.. పీఎస్​లో ఇరువర్గాల ఘర్షణ

By

Published : Sep 13, 2021, 11:16 PM IST

నిశ్చితార్థం అయ్యాక వివాహం రద్దు కావడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని పీఎస్​ వద్ద ఈ ఘటన జరిగింది. వరుడు డిగ్రీ చదవలేదనే కారణంతో అమ్మాయి బంధువులు వివాహం రద్దు చేసుకున్నారు.

నిశ్చితార్థం అయ్యాక వివాహం రద్దు
నిశ్చితార్థం అయ్యాక వివాహం రద్దు

డిగ్రీ చదవలేదని వివాహం రద్దైన ఘటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో జరిగింది. ఇరువర్గాలు విభేదాలతో పీఎస్ సమీపంలోనే గొడవ పడ్డాయి. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. జిల్లాలోని రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన యువకునికి వైరా మండలానికి చెందిన యువతితో నిశ్చితార్థం అయింది. కొన్ని రోజుల అనంతరం ఇరు వర్గాల మధ్య మనస్పర్థలు రావటంతో రెండు కుటుంబాల వారు పెళ్లి రద్దు చేసుకునేందుకు వైరా పోలీస్ స్టేషనుకు వచ్చి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

పెళ్లికి సంబంధించిన విషయంపై రెండు వర్గాల కుటుంబీకులు ఒకరిని ఒకరు దూషించుకోవడంతో రెచ్చిపోయిన వరుడి తరఫు బంధువులు అమ్మాయి బంధువులపై దాడికి యత్నించడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలు రోడ్డుపై రాళ్లు రువ్వుకున్నాయి. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ వసంత్​ కుమార్​ ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.

వరుడికి డిగ్రీ లేదని వివాహం రద్దు

వరుడు నిశ్చితార్ధం సమయంలో డిగ్రీ చదివాడని చెప్పాడు. కానీ ఇంటరే చదివాడని యువతి బంధువులకి తెలిసింది. ఈ విషయంపై వరుడు కుటుంబాన్ని వారు ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. చివరికి రెండు వర్గాలు వైరా పోలీసులను ఆశ్రయించారు.

పీఎస్ ముందే​ ఘర్షణ

పోలీస్​ స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పీఎస్ సమీపంలోనే ఇరువర్గాలు చర్చించుకుంటూ ఘర్షణకు దిగాయి. వరుని బంధువుల దాడిలో వధువు సోదరుడికి గాయాలు కావడంతో ప్రధాన రహదారిపైనే తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు చెందిన 9 మందిపై కేసులు నమోదు చేశారు. డిగ్రీ లేదనే కారణంతో విభేదాలు రావడం, కేసుల వరకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి:మందలించినా మానలేదు.. మనువాడిన మనిషిని వదిలేసి.. మరొకరితో.!

ABOUT THE AUTHOR

...view details