ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో.. మే 3 నుంచి ఇంటర్​ పరీక్షలు..!

By

Published : Jan 21, 2021, 1:16 PM IST

తెలంగాణలో ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలు మే నెల 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఆ నెల 19వ తేదీతో, అన్ని పరీక్షల్ని 24వ తేదీతో పూర్తిచేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఈమేరకు అధికారులు కాలపట్టిక రూపొందిస్తున్నట్లు తెలిసింది.

intermediate
intermediate

తెలంగాణలో ఇంటర్​ వార్షిక పరీక్షలు మే 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ నెలాఖరులో పరీక్షలు ప్రారంభించి మే రెండో వారానికి పూర్తి చేయాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు.. మే 24 నుంచి చివరి విడత జేఈఈ మెయిన్‌ ఉన్నందున ఇంటర్‌ పరీక్షలను మే 3న ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు 19వ తేదీకి పూర్తవుతాయని తెలిసింది.

ప్రత్యక్ష బోధన 34 రోజులే!

ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ వరకు తరగతులు జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో 24 రోజుల చొప్పున, ఏప్రిల్‌లో 20 రోజులు కలిపి మొత్తం 68 రోజులు తరగతులు జరుగుతాయి. అయితే షిఫ్టు విధానం కాకుండా ఒక రోజు ప్రథమ సంవత్సరం, మరుసటి రోజు రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు జరపాలని తాజాగా ప్రభుత్వం సూచించింది. ఇది అమలైతే ఒక్కో ఏడాది విద్యార్థులకు 34 రోజులు మాత్రమే తరగతి గది బోధన అందుతుంది. ఈ విధానాన్ని ప్రభుత్వ కళాశాలలకే వర్తింపజేస్తారా? ప్రైవేట్‌లోనూ అమలు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

* ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు 300కు మించి ఉంటే షిఫ్టు విధానంలో కళాశాలలను నడపాలి. మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత కళాశాలల నిర్వహణ విధానం మారితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

తొలగించిన సిలబస్‌ నుంచి అసైన్‌మెంట్లు

సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్‌పైనే వార్షిక పరీక్షలుంటాయి. మిగిలిన 30 శాతం నుంచి అసైన్‌మెంట్లు ఇస్తారు. ఆ సిలబస్‌పై ఒకటి రెండు పరీక్షలు జరుపుతారు. వాటికి ఇంటి వద్ద సమాధానాలు రాసి సమర్పించాలి. అయితే ఇది ఎంతవరకు ప్రయోజనం అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఎంసెట్‌ సిలబస్‌పై మండలితో చర్చించాకే నిర్ణయం

జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఎంసెట్‌కు కూడా మొత్తం సిలబస్‌ను పరిగణనలోకి తీసుకొని నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య, నైతిక విలువల పరీక్షలను నిర్వహించడానికే బోర్డు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఒకసారి వాటిని పక్కనపెడితే భవిష్యత్తులో కూడా అదే డిమాండ్‌ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

తప్పిన విద్యార్థులకు కనీస మార్కులు!

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తప్పిన 1.92 లక్షల మంది విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని, కనీస మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేసేదిశగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ మార్కులు కావాలంటే వారు మళ్లీ మే పరీక్షల్లో రాసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:టీకా తీసుకునేందుకు 80 శాతం మంది రెడీ!

ABOUT THE AUTHOR

...view details